– గ్రంథాలయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆచార్య లక్ష్మణరావు
నల్లగొండ, ఫిబ్రవరి 14 : తెలంగాణలో గ్రామ గ్రామాన గ్రంథాలయాలు నెలకొల్పాలని అలాగే గ్రామాల్లో వసూలు చేస్తున్న గ్రంథాలయ పన్నును విధిగా గ్రంథాలయానికే కేటాయించాలని గ్రంథాలయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య లక్ష్మణరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ గ్రామ గ్రామాన గ్రంథాలయాలు ఏర్పాటు, అభివృద్ధిలో మేధావులు, రచయితలు, సాహిత్యకారుల పాత్ర అనే అంశంపై తెలంగాణ గ్రంథాలయ సంఘం అలాగే ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల నల్లగొండ గ్రంథాలయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం మహిళా డిగ్రీ కళాశాలలో ఒకరోజు సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రంథాలయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య లక్ష్మణరావు, గౌరవ అతిధి డాక్టర్ గోన రెడ్డి, మరొ అతిథి డాక్టర్ బెల్లి యాదయ్య, తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంఘం ప్రధాన కార్యదర్శి డా.రవికుమార్ చేగోని, గాద వినోద్ రెడ్డి అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆచార్య లక్ష్మణరావు మాట్లాడుతూ.. రాష్త్ర వ్యాప్తంగా ప్రభుత్వాలు గ్రామాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని, స్వచ్ఛందంగా గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తే తగిన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. డాక్టర్ గోనారెడ్డి మాట్లాడుతూ కోమటిరెడ్డి ప్రతిక్ ఫౌండేషన్ తరపున గ్రంథాలయాల ఏర్పాటుకు సహకారం అందిస్తామని తెలిపారు. ఆచార్య బెల్లి యాదయ్య మాట్లాడుతూ ఉన్నతుల సహకారంతో స్వచ్ఛంద గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని, వీధి వీధినా గ్రంథాలయాలు, కమ్యూనిటీ గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని గ్రంథాలయ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు. డా.రవి కుమార్ చేగొని మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతం చైతన్యవంతమైనదని ఈ ప్రాంతంలో గ్రంధాలయాలు స్వాతంత్రానికి ముందు ఏర్పాటు చేయబడ్డమని అలాంటి గ్రంథాలయాల ఏర్పాటు సంస్కృతి ఇప్పుడు పునర్వికాసం చెందాలని కోరారు. కళాశాల గ్రంథాలయ శాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ రాజారామ్ మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థినీలలో తరచుగా గ్రంధాలయాల వినియోగం చేసుకోవాలని తద్వారా తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కవి మూనాస వెంకట్, సుధారాణి, బైరెడ్డి కృష్ణారెడ్డి, మేరెడ్డి యాదగిరి రెడ్డి, ఎలికట్ట శంకర్, డాక్టర్ హస్సేనా, అంబటి వెంకన్న, కస్తూరి ప్రభాకర్, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, వట్టికూటి వెంకటేశ్వర్లు, పగడాల నరేందర్, డాక్టర్ దుర్గాప్రసాద్, డాక్టర్ లక్పతి, మోత్కూరు శ్రీనివాస్, పడిశాల నాగరాజు, బుచ్చిరాములు, రాజగౌడ్, పల్లె సతీష్, డా.బేబీ కుంజ, భావన, ఋషి, రచయితలు, కవులు, కళాకారులు, గ్రంథ పాలకులు, గ్రంథాలయ శాస్త్ర విద్యార్థులు, పరిశోధకులు పాల్గొన్నారు.