US shooting : అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కలకలం రేపాయి. కెంటకీ రాష్ట్రం (Kentucky State) లోని లెక్సింగ్టన్ (Lexington) లోగల ఓ పార్కులో జరిగిన ఈ కాల్పుల్లో ఐదుగురు మృతిచెందారు. మృతుల్లో 16 ఏళ్ల బాలుడు సహా నలుగురు పెద్దలు ఉన్నారు. మరో 13 ఏళ్ల బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. తొలుత ఓ నివాసంలోకి ప్రవేశించిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ముగ్గురు మృతిచెందారు.
అనంతరం అక్కడి నుంచి పరారై మరో ఇంటికి వెళ్లి కాల్పులు జరపడంతో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత సమీప అటవీ ప్రాంతంలో మరో మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు పాల్పడినట్లు అనుమానిస్తున్న 39 ఏళ్ల చాడ్ హిక్మన్ మృతదేహం కూడా అదే అటవీ ప్రాంతంలో లభ్యమైంది. దాంతో ఈ ఘటనలో నిందితుడి ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోంది.
డెట్రాయిట్కు సుమారు 170 మైళ్ల (270 కిలోమీటర్ల) దూరంలోని ఓ ఇంట్లో కాల్పులు జరిగినట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇంట్లో తనిఖీలు చేపట్టిన అధికారులు 16 ఏళ్ల బాలుడు, 45 ఏళ్ల వ్యక్తి, 40 ఏళ్ల మహిళ మృతదేహాలను గుర్తించారు. అదే ఇంట్లో 13 ఏళ్ల బాలిక కూడా తుపాకీ గాయాలతో కనిపించింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.
కాల్పుల అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతడి కోసం మిస్సాకీ కౌంటీలో భారీగా గాలింపు చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు కొనసాగుతున్న సమయంలో మరో ఇంట్లో 53 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అతడు కూడా తుపాకీ గాయాలతో మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. దాంతో నిందితుడే ఈ హత్య కూడా చేసి పరారయ్యాడని భావించిన పోలీసులు, అతడి కోసం విస్తృతంగా గాలించారు.
అదే సమయంలో సమీపంలోని అటవీ ప్రాంతంలో 39 ఏళ్ల మహిళ మృతదేహం లభించింది. ఆమె మృతదేహం పక్కనే అనుమానితుడు చాడ్ హిక్మన్ మృతదేహం కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పుల్లో మృతిచెందిన వారందరూ తుపాకీ గాయాల కారణంగానే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. హిక్మన్ ఎలా మృతి చెందాడు..? కాల్పులకు కారణమేంటి? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే.. కోర్టు రికార్డుల ప్రకారం.. చాడ్ హిక్మన్పై గతంలోనూ కేసు నమోదైంది. ఓ బాలికను వేధించిన కేసులో 2024లో అతడికి ఏడాది జైలుశిక్ష పడినట్లు పోలీసులు తెలిపారు. తాజా కాల్పుల ఘటనకు ఆ కేసుకు ఏమైనా సంబంధం ఉందా..? అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. ఇదిలావుంటే మరోవైపు వర్జీనియా స్టేట్ యూనివర్సిటీలోనూ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ విద్యార్థి సహా ఐదుగురు గాయపడ్డారు. ఈ కేసులో 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు ఘటనలు వేర్వేరుగా చోటుచేసుకున్నప్పటికీ వరుస కాల్పులతో అమెరికాలో మరోసారి భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.