RajaSen | టాలీవుడ్ (బెంగాలీ సినీ పరిశ్రమ)లో విషాదం నెలకొంది. ప్రముఖ బెంగాలీ చలనచిత్ర దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత రాజా సేన్ (71) కోల్‌కతాలోని ఎస్ఎస్కేఎం ఆసుపత్రిలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. వెన్నునొప్పి కారణంగా కొద్ది రోజుల క్రితం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన రాజా సేన్ ఆరోగ్య పరిస్థితి చికిత్స సమయంలో క్రమంగా క్షీణించింది. ఊపిరితిత్తులు, గుండె మరియు కిడ్నీ సంబంధిత సమస్యలు తలెత్తడంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను వేరే ఆసుపత్రికి తరలించారు. అక్కడ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లు పీటీఐ నివేదిక వెల్లడించింది.
1996లో విడుదలైన ‘దాము’ చిత్రంతో ఆయన దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. ఒక బాలుడికి, ఏనుగుకు మధ్య ఉండే అనుబంధం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. ఈ చిత్రంతో ఆయన బెంగాలీ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన కెరీర్లో ఫీచర్ ఫిలిమ్స్, టెలివిజన్ ధారావాహికలు, డాక్యుమెంటరీలతో ఎంతో పేరు సంపాదించారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలలో ‘ఆత్మీయ స్వజన్’, ‘దేశ్’, ‘దేవిపక్ష’, ‘కృష్ణకాంతర్ విల్’, ‘ల్యాబొరేటరీ’, ‘మాయా మృదంగ’ వంటి పలు ప్రసిద్ధ సినిమాలు ఉన్నాయి.
అలాగే, 2002లో జయా బచ్చన్, అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘దేశ్’ చిత్రానికి కూడా ఆయన దర్శకత్వం వహించారు. ఫీచర్ ఫిలిమ్స్‌తో పాటు, ప్రముఖ రవీంద్ర సంగీత గాయని సుచిత్రా మిత్రతో సహా పలువురు ప్రముఖ దిగ్గజాల జీవితాలపై ఆయన డాక్యుమెంటరీలను కూడా రూపొందించారు. రాజా సేన్ మృతి పట్ల బెంగాలీ సినీ పరిశ్రమతో పాటు పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.