MLA Sunitha Lakshma Reddy | కొల్చారం, మే 16 : ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే వర్షాల కారణంగా రైతులకు నష్టం జరిగిందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డి ఇవాళ కొల్చారం మండల పరిధిలోని పోతంశెట్టిపల్లి ధాన్యం కొనుగోలు కేంధ్రాన్ని సందర్శించారు. తడిసిన ధాన్యం రాశులను, లారీలు రాక ఎక్కడివక్కడే ఉన్న తూకం వేసిన ధాన్యం బస్తాలను పరిశీలించారు. అక్కడి నుండి కలెక్టర్కు ఫోన్ చేసి వెంటనే ధాన్యం తరలించడానికి లారీలు పంపించాలని కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ అసమర్థత వల్లనే ధాన్యం వర్షానికి తడిసి రైతులు నష్టపోవాల్సిన దుస్థితి దాపురించిందని మండిపడ్డారు. గతంలో కోతలు మొదలు పెట్టగానే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఎమ్మెల్యేలపై ఒత్తిడి చేస్తే అవి ప్రారంభించామన్నారు. తీరా కేంద్రాలు ప్రారంభమయ్యాక 10,15 రోజులకుగాని తూకం ప్రారంభించలేదన్నారు. మళ్లీ కాంటాలు ప్రారంభించాలని తాము వెంటపడితే ఆలస్యంగా తూకాలు ప్రారంభించారన్నారు.
తూకం ఆలస్యం కావడంతో కేంద్రాల్లో ధాన్యం రాశులు పేరుకుపోయాయన్నారు. ఇప్పుడు అకాల వర్షాలకు పూర్తిగా తడిసి మొలకలు వచ్చాయని.. కొన్ని చోట్ల వడ్లు ముక్కిపోయాయన్నారు. పోతం శెట్టి పల్లి కొనుగోలు కేంద్రంలో సుమారు 9 లారీల సన్న రకం ధాన్యం, మరో 19 లారీల దొడ్డు రకం ధాన్యం ఎక్కడిదక్కడే ఉందన్నారు. సమయానికి లారీలు రాక తూకం వేసిన ధాన్యం బస్తాలు సైతం వర్షానికి తడిసి ఎక్కడివక్కడే ఉన్నాయన్నారు.
మొలకలు వచ్చిన, ముక్కిన ధాన్యం మిల్లర్లు తీసుకునే పరిస్థితి లేదన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షం పాలవడంతో నేడు రైతుల కళ్లల్లో కడగండ్లు మిగిలాయి అన్నారు. గత పది, పన్నెండు రోజులుగా కొనుగోలు కేంద్రాలకు లారీలు రావడం లేదన్నారు. కుల్చారం, పోతంశెట్టిపల్లి, చిన్న ఘనపూర్, రంగంపేట, పైతర, కోనాపూర్, ఎనగండ్ల, వై మాందాపూర్ గ్రామాలలో తడిసిన ధాన్యాన్ని అదనపు రవాణా సౌకర్యం కల్పించి మిల్లులకు పంపించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట తాజా మాజీ జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్, సీడీసీ మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, మన్సూర్ అలీ, కొమ్ముల యాదాగౌడ్, గౌరీశంకర్, సిద్దిరాములు, చిట్యాల యాదయ్య, యాదగిరి తదీతరులు ఉన్నారు.
Read Also :
Water tank | పాఠశాలలో శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంక్.. భయందోళనలలో విద్యార్థులు
Badibata program | నిజాంపేట మండల వ్యాప్తంగా బడిబాట కార్యక్రమం
Huge Donation | తిరుమల శ్రీవారికి ప్రముఖ వ్యాపారవేత్త గోయాంక భారీ విరాళం