BrahMos Missiles : భారత ఆయుధ తయారీ, రక్షణ రంగానికి భారీ బూస్ట్ లభించింది. ఇండియా నుంచి బ్రహ్మోస్ క్షిపణులు కొనేందుకు ఇండోనేసియా ముందుకొచ్చింది. దీనికి సంబంధించి 200 మిలియన్ డాలర్ల నుంచి 350 మిలియన్ డాలర్ల వరకు ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఇండోనేసియా బ్రహ్మోస్ క్షిపణులు కొనుగోలుపై 2023లోనే ప్రచారం జరిగింది. అప్పట్లో అది ప్రాథమిక చర్చల దశలోనే ఉంది.
ఇప్పుడు ఈ చర్చలు ఒప్పందం దశకు చేరినట్లు ఇండోనేసియా రక్షణ శాఖ ప్రతినిధి రికో రికార్డో సిరైట్ సోమవారం వెల్లడించారు. తమ దేశం సైనిక, రక్షణ పరంగా ఆధునిక శక్తి సామర్ధ్యాలను పెంచుకునే లక్ష్యంలో భాగంగా ఈ ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు అందులోనూ తెలిపారు. సముద్ర తీర దేశం కావడంతో తమకు రక్షణ పరంగా ఇది కీలకమన్నారు. అయితే, ఒప్పందం విలువను మాత్రం వెల్లడించలేదు. ఇంతకుముందు ఫిలిప్పైన్స్‌తో కూడా బ్రహ్మోస్ సంస్థ 2022లో ఒప్పందం కుదుర్చుకుంది. తాజాగా ఇండోనేసియాతో ఒప్పందంపై బ్రహ్మోస్ సంస్థ కానీ, భారత రక్షణ శాఖ కానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు.
బ్రహ్మోస్.. అధునాతన, సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్. ఇది నేటి యుద్ధ పరిస్థితులకు తగిన సామర్ధ్యం కలిగి ఉంది. దీన్ని ఇండియా, రష్యా కలిపి సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇండియాకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో), రష్యాకు చెందిన ఎన్పీవో మషినోస్ట్రైనియా సంస్థలు కలిసి సంయుక్తంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ అనే సంస్థను ఏర్పాటు చేశాయి. ఈ కంపెనీయే బ్రహ్మోస్ క్షిపణుల్ని తయారు చేసింది. ఇండియాలోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మోస్క్వా అనే నదుల పేర్లను కలిపి దీనికి బ్రహ్మోస్ అని పేరు పెట్టారు. ఈ క్షిపణులు 2.8 నుంచి 3.0 మ్యాక్ స్పీడ్‌తో వెళ్లగలవు. అంటే శబ్దవేగంకంటే మూడు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. ప్రస్తుతం ఉన్న ఎయిర్‌డిఫెన్స్ సిస్టమ్స్ వీటిని అంత త్వరగా గుర్తించలేవు. ఈ క్షిపణుల్ని సముద్రంపైనుంచి, భూమి పైనుంచి, సబ్ మెరైన్స్ నుంచి, గాలిలో నుంచి కూడా ప్రయోగించవచ్చు.
ఫైర్ అండ్ ఫర్గెట్ ప్రిన్సిపిల్తో దీన్ని ఆపరేట్ చేస్తే, లక్ష్యాన్ని ఒక మీటర్ పరిధిలో చేధించగలదు. దీని రేంజ్ 290 కిలోమీటర్లు. అయితే, ఎక్స్టెంటెడ్ రేంజ్ 450 కి.మీ. నుంచి 800 కి.మీ. బ్రహ్మోస్ తర్వాతి తరం క్షిపణులు కూడా సిద్ధమవుతున్నాయి. వీటి రేంజ్ మరింత ఎక్కువగా ఉంటుంది. గత ఏడాది ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ఈ క్షిపణుల్ని భారత సైన్యం ప్రయోగించింది. పాకిస్తాన్‌పై ప్రయోగించగా మంచి విజయం సాధించాయి. అందువల్ల వీటికి డిమాండ్ పెరిగిందని నిపుణులు అంటున్నారు.