MLA Sunitha Lakshma Reddy | నర్సాపూర్, జనవరి 12: నర్సాపూర్ అటవీ ప్రాంతంలోని కోతుల ప్రాణాలు అలాగే అడవి గుండా ప్రయాణించే ప్రయాణికుల ప్రాణాలను కాపాడడానికే కోతుల ఆహార సేకరణ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి వెల్లడించారు. సోమవారం సర్సాపూర్ అటవీ ప్రాంతంలోని అర్భన్ పార్క్ సమీపంలో ఊన్ హాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోతుల ఆహార సేకరణ కేంద్రాన్ని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. నర్సాపూర్ అటవీ ప్రాంతం గుండా రోడ్డు మార్గం సుమారు 12 కిలోమీటర్లు ఉందని, అందులో చాలా కోతులు ఉన్నాయన్నారు. కోతులను మనం ఆంజనేయస్వామిగా కొలుస్తామని, అలాంటి కోతులు చనిపోతుంటే చాలా బాధగా ఉంటుందని తెలిపారు. కోతులకు ఆహారం దొరకక రోడ్డపైకి రావడం జరుగుతుందని, దీంతో కోతులు, ప్రయాణికులు మృత్యువాత పడాల్సి వస్తుందన్నారు. అందుకే ఎవరికి ప్రాణ నష్టం లేకుండా ఉండడానికి ఊన్ హాండ్స్ ఫౌండేషన్ వారు కోతుల ఆహార సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తుచేశారు.
సిబ్బంది అడవి లోపలికి వెళ్లి కోతులకు ఆహారాన్నిఇస్తారు..
కోతులకు ఆహారాన్ని రోడ్డుపైన వేయకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆహార సేకరణ కేంద్రంలో వేయాలని సూచించారు. రోడ్లపైన ఆహారాన్ని వేసి వాటి ప్రాణాలను తీయవద్దని, ఆహార సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని గతంలో మాధవానంద సరస్వతి చెప్పడం జరిగిందని గుర్తుచేశారు. కావున నేడు అటవి శాఖ, ఊన్ హాండ్స్ ఫౌండేషన్ వారు ముందుకు వచ్చి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలిపారు. ఈ కేంద్రంలో ఆహారాన్నిఅందజేస్తే అక్కడి సిబ్బంది అడవి లోపలికి వెళ్లి కోతులకు ఆహారాన్ని అందజేస్తారని తెలిపారు.
గతంలో ఓ ఫౌండేషన్ ద్వారా జంతువులు నీరు త్రాగడానికి చిన్న ట్యాంకులు ఏర్పాటు చేయించామని గుర్తుచేశారు. అలాగే అడవిలో పండ్ల చెట్లను నాటితే కోతులకు అడవిలోనే ఆహారం దొరుకుతుందని సూచించారు. ఇందుకు గాను మా వంతు సంపూర్ణ సహకారం ఉంటుందని వెల్లడించారు. కోతులకు కుటుంబ నియంత్రణ చేస్తే బాగుంటుందని వాటి సంతతి పెరుగకుండా ఉంటుందని అటవి శాఖ అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఊన్ హాండ్స్ ఫౌండేషన్ రిటైర్డ్ పీసీసీఎఫ్ రఘువీర్, డిఎఫ్ఓ జోజీ, ఎఫ్ఆర్ఓ అంబర్ సింగ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సత్యంగౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నయోమొద్దీన్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బిక్షపతి, బీఆర్ఎస్ నాయకులు ప్రసాద్, షేక్ుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

