Varanasi | దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ చిత్రం ‘వారణాసి’ పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో రాజమౌళి ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు. హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గ సాంకేతిక విలువలు, కథనంతో ఈ సినిమాను నిర్మించనున్నట్లు ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో బలమైన చర్చ నడుస్తోంది. సుమారు రూ.1300 కోట్లకు పైగా బడ్జెట్‌తో ‘వారణాసి’ను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇది భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలవనుంది. ఈ సినిమాను పూర్తిగా IMAX ఫార్మాట్లో చిత్రీకరిస్తుండటం విశేషం.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని, ఈ చిత్రాన్ని అనేక భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా ప్రియాంక చోప్రా నటిస్తున్న విషయం తెలిసిందే హాలీవుడ్ అనుభవం ఉన్న ప్రియాంక పాత్ర సినిమాకు అంతర్జాతీయ ఆకర్షణను తీసుకురానుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. మహేష్ బాబు పాత్రతో పాటు సినిమాలో ఒక స్పెషల్ నెగటివ్ క్యారెక్టర్ కూడా ఉండబోతుందని, ఆ పాత్రకు ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడు ఎంపికైనట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ పాత్ర కథలో కీలక మలుపులు తిప్పేలా ఉంటుందని సమాచారం.
‘వారణాసి’కి రాజమౌళి రెగ్యులర్ టీమ్ పని చేస్తుండటం సినిమాపై నమ్మకాన్ని మరింత పెంచుతోంది. మూవీకి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, కథ విజయేంద్ర ప్రసాద్ అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ దేశవ్యాప్తంగా విశేష స్పందనను తెచ్చుకుంది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మహేష్ బాబు లుక్ అన్ని కలిపి సినిమా స్థాయిని పెంచాయి. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’తో భారతీయ సినిమాను ప్రపంచ పటంలో నిలిపిన రాజమౌళి, ఇప్పుడు ‘వారణాసి’తో ఆ స్థాయిని మరింత పెంచాలని చూస్తున్నారు. మహేష్ బాబు కెరీర్లోనే ఇది అత్యంత భారీ, డిఫరెంట్ ప్రాజెక్ట్‌గా మారనుంది. ఇంకా పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉన్నా, ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ చూస్తే ‘వారణాసి’ కేవలం సినిమా కాదు.. ఒక గ్లోబల్ ఈవెంట్ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు.