Allu Arjun |టాలీవుడ్లో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన హీరో శ్రీవిష్ణు మరోసారి ఆడియన్స్‌ను నవ్వించేందుకు సిద్ధమవుతున్నాడు. శ్రీవిష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘విష్ణు విన్యాసం’ పూర్తిగా ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా నయన్ సారిక నటిస్తుండగా, కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీ రావు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫిబ్రవరిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ఇప్పటికే ప్రమోషన్లకు మంచి ఊపు వచ్చింది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ‘దేఖో విష్ణు విన్యాసం’ అనే పాట అనుకోకుండా వివాదానికి దారితీసింది.
పాటలో చూపించిన ఒక విజువల్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు కారణమైంది. అల్లు అర్జున్ అభిమానులు ఈ సీన్‌ను తీవ్రంగా తప్పుబడుతూ, తమ హీరోను అవమానించారని ఆరోపిస్తున్నారు. అసలు వివాదానికి కారణం ఏంటంటే… అల్లు అర్జున్ తనకు ప్రత్యేకమైన గుర్తింపుగా ‘AA’ బ్రాండ్‌ను ఉపయోగిస్తుంటారు. ‘AA’ అంటే అల్లు అర్జున్, అల్లు ఆర్మీకి సంకేతంగా అభిమానులు భావిస్తారు. అల్లు అర్జున్ కూడా తన సినిమాలు, ప్రమోషన్లలో ఈ బ్రాండ్‌ను తరచూ హైలైట్ చేస్తుంటారు. అయితే ‘విష్ణు విన్యాసం’ పాటలో AA బ్రాండ్‌ను తలకిందులుగా చూపించడం ద్వారా అది ‘VV’ గా మారినట్లు చూపించారు. దీనిని మూవీ టైటిల్ అయిన ‘విష్ణు విన్యాసం’కి కనెక్ట్ చేసినా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం దీనిని అవమానంగా తీసుకున్నారు. “ఉద్దేశపూర్వకంగానే AA బ్రాండ్‌ను తలకిందులుగా చూపించి మా హీరోని ట్రోల్ చేశారు” అంటూ సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
ఈ పాట విడుదలైన వెంటనే ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫార్మ్‌లలో అల్లు అర్జున్ అభిమానులు మండిపడుతున్నారు. కొందరు ఈ సన్నివేశాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తుండగా, మరికొందరు మూవీ టీమ్ నుంచి క్షమాపణ రావాలని కోరుతున్నారు. దీంతో ఈ చిన్న విజువల్ ఇప్పుడు టాలీవుడ్ అంతటా హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు ‘విష్ణు విన్యాసం’ మూవీ టీమ్ ఈ వివాదంపై అధికారికంగా స్పందించలేదు. ఇది కేవలం సరదా కోణంలో రూపొందించిన సీన్ మాత్రమేనా? లేక నిజంగానే ఎవరినైనా టార్గెట్ చేశారా? అన్న ప్రశ్నలు ప్రేక్షకుల్లో తలెత్తుతున్నాయి. మేకర్స్ నుంచి వచ్చే స్పందనపై ఇప్పుడు అందరి దృష్టి పడింది.