శనివారం 31 అక్టోబర్ 2020
Medak - May 26, 2020 , 01:47:44

చెక్‌డ్యాంల నిర్మాణంతో తీరనున్న సాగు, తాగునీటి సమస్య

చెక్‌డ్యాంల నిర్మాణంతో తీరనున్న సాగు, తాగునీటి సమస్య

  • హుస్నాబాద్‌ డివిజన్‌లో మూడు చెక్‌డ్యాంల నిర్మాణాలు పూర్తి
  • హుస్నాబాద్‌, కోహెడ, బెజ్జంకి మండలాలకు మరో 13 చెక్‌డ్యాంలు మంజూరు
  • పొట్లపల్లి, బస్వాపూర్‌లలో కొనసాగుతున్న నిర్మాణ పనులు 

రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నది. తాగు, సాగునీటి సమస్యను తీర్చేందుకు ప్రాజెక్టుల నిర్మిస్తున్నది. మెట్ట ప్రాంతాల నుంచి వచ్చే వరదనీటిని నిల్వ చేసేందుకు లోతట్టు ప్రాంతాల్లో చెక్‌డ్యాంలను నిర్మిస్తున్నది. వర్షాకాలంలో చెక్‌ డ్యాంలు నిండితే చెరువులను నింపుకోవడంతోపాటు భూగర్భ జలాలు పెరుగుతాయన్నదే సర్కారు సదుద్దేశం. ఇందులో భాగంగా హుస్నాబాద్‌ డివిజన్‌లో చెక్‌డ్యాం నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే మూడు చెక్‌డ్యాంల నిర్మాణాలు పూర్తి కాగా హుస్నాబాద్‌, కోహెడ, బెజ్జంకి మండలాల్లో మరో 13 చెక్‌డ్యాంలను నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.  

హుస్నాబాద్‌ డివిజన్‌లో చెక్‌డ్యాంల నిర్మాణం జోరుగా సాగుతున్నది. కోహెడ మండలం పోరెడ్డిపల్లి శివారులోని మోయెతుమ్మెద వాగుపై రూ.12కోట్లతో బ్రిడ్జి కం చెక్‌డ్యాం నిర్మాణంతో పాటు గుండారెడ్డిపల్లిలోని ఒగ్గుపాగు వాగుపై  రూ.3కోట్లతో చెక్‌డ్యాం నిర్మాణం పూర్తయింది. వర్షాకాలం చివరలో మత్తడి పారిన పోరెడ్డిపల్లి చెక్‌డ్యాంను మంత్రి  హరీశ్‌రావు గడిచిన అక్టోబర్‌ 20వ తేదీన సందర్శించి గంగమ్మకు పూజలు చేశారు. ఈ రెండు చెక్‌డ్యాంల వల్ల భూగర్భ జలాలు పెరిగి చుట్టుపక్కల వ్యవసాయ బావుల్లో  పుష్కలంగా నీరు చేరింది. హుస్నాబాద్‌ మండలం పొట్లపల్లి రాజేశ్వరస్వామి గుడి ఎదురుగా ఉన్న రేణుకా వాగుపై రూ.1.09కోట్లతో చేపట్టిన చెక్‌డ్యాం నిర్మాణం పూర్తయింది.  తాగు, సాగునీటి సమస్యను పరిష్కరిస్తున్న సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌లకు పొట్లపల్లి, పోరెడ్డిపల్లి, గుండారెడ్డిపల్లి గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు చెప్తున్నారు.

మూడు మండలాలకు 13చెక్‌డ్యాంలు... 

హుస్నాబాద్‌, కోహెడ మండలాలకు కలిపి ఇటీవల 13చెక్‌డ్యాంలు మంజూరయ్యాయి. కోహెడ మండలంలో 8, హుస్నాబాద్‌ మండలానికి 2, బెజ్జంకి మండలానికి 3 చెక్‌డ్యాంలు మంజూరు కాగా ఇందులో పొట్లపల్లిలోని రేణుకా వాగు ఎల్లమ్మ గుడి సమీపంలో రూ.3.85కోట్లతో ఒకటి, బస్వాపూర్‌లోని మోయెతుమ్మెద వాగుపై రూ.4కోట్లతో మరొక చెక్‌డ్యాం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కోహెడ మండలం తంగళ్లపల్లి, వింజపల్లి, వరికోలు, నారాయణపూర్‌, కూరెల్ల, హుస్నాబాద్‌ మండలంలోని హుస్నాబాద్‌ ఎల్లమ్మ వాగుపై చెక్‌డ్యాం నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సి ఉంది. బెజ్జంకి మండలంలోని గుగ్గిల్ల, దేవక్కపల్లి, తోటపల్లి గ్రామాల శివారులోని వాగుల్లో కూడా చెక్‌డ్యాంలను నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ చెక్‌డ్యాంల నిర్మాణం పూర్తయితే పరోక్షంగా సుమారు మూడు వేల ఎకరాలకు సాగునీరు అందనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

భూగర్భ జలాలు పెరుగుతున్నాయి...

చెక్‌డ్యాంల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. వాగుల నుంచి వృథాగా పోతున్న నీటిని నిల్వ చేయడం వల్ల బోరుబావుల్లోకి పుష్కలంగా నీరు చేరుతున్నది. దీంతో వ్యవసాయ సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. ఇప్పటికే హుస్సాబాద్‌ డివిజన్‌లో మూడు చెక్‌డ్యాంల నిర్మాణాలు పూర్తికాగా మరో 13 చెక్‌ డ్యాంల నిర్మించేందుకు నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వం అనుమతులు రాగానే చెక్‌డ్యాంల నిర్మాణాలను ప్రారంభిస్తాం. 

- శ్రీధర్‌, నీటిపారుదల శాఖ ఏఈ, హుస్నాబాద్‌