Summer | వనపర్తి : పదిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. ఎండ వేడిమికి మనుషులే కాదు, జంతువులకు, వాహనాలకు కూడా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అకస్మాత్తుగా వాహనంలో నుంచి మంటలు వస్తున్న సందర్భాలు చాలా వరకు చూస్తూనే ఉంటాం. ఎండాకాలంలో వాహనాల్లో ప్రయాణించాలంటే అన్ని రకాల జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. వాహనాల్లో ప్రధానంగా ఇంజిన్, విద్యుత్ సరఫరా అయ్యే వైర్ల లోపంతో అత్యధికంగా వాహనాల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు మెండుగా ఉంటాయి. కారు ఇతర వాహనాల్లో అంతర్గతంగా ఉన్న ఎలక్ట్రికల్ వైరింగ్ ఓవర్హీట్తో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు అంటుకుని ప్రమాదాలు జరుగుతుంటాయి. వైరింగ్ డ్యామేజిని గుర్తించకపోవడం, మరమ్మతు సమయంలో నాణ్యత లేని వైర్ బిగించడం, జాయింట్లవ ద్ద సరిగ్గా టేఫ్ వేయకపోవడంతో వైర్లు ఒకదానికి ఒకటి కలవడంతో షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు ఉంటాయని మెకానిక్లు తెలిపారు. పాత వాహనాల్లో ఎక్కువ అగ్న ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నందున వాహనాలను తనిఖీ చేసుకుని తమ ప్రయాణాలు సాగించాలి.
☞ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న సమయంలో ఇంజన్ త్వరగా వేడి ఎక్కుతుంది.
☞ వాహనాల్లో నాణ్యతలేని వైర్లు వాడితే స్పార్క్స్ వచ్చి మంటలు వ్యాపించే అవకాశం ఉంటుంది.
☞ వాహనాల్లో ఫాగ్లైట్స్, ఇతర డెకరేషన్ వంటి లైట్స్ బిగించడంతో ఎలక్ట్రిక్ వైర్లపై ఎక్కువ లోడ్ పడుతుంది.
☞ పాత వాహనాలకు గ్యాస్ కిట్లను అమర్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
☞ ప్రతి వాహనాన్ని నిర్ణీత సమసయంలో సర్వీసింగ్ చేయించాలి.
☞ ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాల్లో నిర్ణీత కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఇంజన్లో ఉండే ఆయిల్ ఫిల్టర్లను మార్చుకోవాలి.
☞ తరచూ ఇంజన్ ఉష్ణోగ్రతను తనిఖీ చేస్తుండాలి.
ఎండాకాలంలో వాహనాలతో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే వాహనాలు అగ్ని ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. వాహనాల్లో ప్రధానంగా గ్యాస్, డీజిల్, పెట్రోల్ వంటివి లీకేజీ లేకుండా చూసుకోవాలి. లేకపోతే ప్రమాదాలు జరుగుతాయి. వాహనం దూర ప్రయాణం చేసిన తర్వాత నీడలో పార్కింగ్ చేయాలి. ఇంజన్, వైరింగ్ వంటి వాటిపై ఓవర్ లోడ్ పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
– చంద్రశేఖర్, అగ్నిమాపక శాఖ అధికారి, వనపర్తి జిల్లా
Summer | ఎండాకాలం పసిబిడ్డలకు నీళ్లు అవసరమా?”