Summer | వేసవిలో పసిపిల్లలకు రోజూ ఎన్ని నీళ్లు ఇవ్వాలి? బిడ్డలు మరీ ఎక్కువ ద్రవాలు తీసుకుంటే ఏమైనా ఇబ్బంది ఉంటుందా? దయచేసి నా సందేహం తీర్చండి.
– ఓ పాఠకురాలు
వేసవి ఉష్ణోగ్రతల వల్ల శరీరం చెమట రూపంలో నీటిని కోల్పోతుంది. కాబట్టి, వేసవిలో మరిన్ని నీళ్లు అవసరం అవుతాయి. మరి, చంటి పిల్లల మాటేమిటి? పాలతోపాటు నీళ్లు కూడా తాగించాలా? అని అడుగుతుంటారు చాలామంది. ఆరు నెలలలోపు పిల్లలకు తల్లిపాలు సరిపోతాయి. అదనపు ఆహారం, నీళ్లు అవసరం లేదు. ఆరు నెలలు దాటిన తర్వాత ఘనాహారంతోపాటు మంచి నీళ్లూ ఇవ్వొచ్చు. ఆడుకునేటప్పుడు, అన్నం తిన్న తర్వాత, పాలు తాగిన అరగంట తర్వాత.. రెండు, మూడు టేబుల్ స్పూన్లు మాత్రమే తాగించాలి. తొమ్మిది, పది నెలలు వచ్చే సరికి రోజుకు గ్లాసు వరకూ ఇవ్వొచ్చు.
పదకొండు నెలలు నిండాక.. రోజుకు రెండుమూడు గ్లాసుల వరకూ ఫర్వాలేదు. రెండు సంవత్సరాల పిల్లలతో మజ్జిగ, రాగి జావ తాగిస్తే మరీ మంచిది. ఈ సీజన్లో దొరికే పండ్లతో రసాలు చేసి ఇవ్వొచ్చు. కాకపోతే పంచదార కలపొద్దు. మామిడి, బొప్పాయి, దానిమ్మ, పుచ్చకాయ, ద్రాక్ష .. ఎంచుకోవచ్చు. మరొక్క మాట. నెలల పిల్లలు బొమ్మలు, ఇతర వస్తువులు కొరుకుతూ ఉంటారు. కీరా, పుచ్చకాయ, టమాట ముక్కలు వాళ్ల చేతికి ఇచ్చేస్తే.. బొమ్మలకు బదులుగా వాటిని కొరికేస్తూ కాలక్షేపం చేస్తారు. దీనివల్ల రుచులు తెలుస్తాయి. పోషకాలు, పీచు పదార్థాలు, నీళ్లు శరీరానికి అందుతాయి.
– మయూరి ఆవుల, న్యూట్రిషనిస్ట్
Mayuri.trudiet@gmail.com