PM Modi : ఒక మహిళతో ప్రధాని మోదీ ఉన్న ఏఐ మార్ఫుడ్ ఫొటోను సీజేపీ నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో బాధిత మహిళ ఏకంగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఈ పోస్టును తొలగించాల్సిందిగా మెటా సంస్థను ఆదేశించింది. అలాగే, సీజేపీ సహా ఆ సంస్థ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, కీలక నేతలు అశుతోష్ రాంకా, రత్నా సింగ్కు కోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రధాని మోదీ ఒక మహిళతో ఉన్నట్లుగా మార్ఫింగ్ చేసిన ఫొటోను ఇటీవల సీజేపీ నేతలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు.
దీంతో ఈ అంశంపై బాధిత మహిళ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరింది. జస్టిస్ గిరీష్ కత్పాలియా ఆధ్వర్యంలోని బెంచ్ దీనిపై విచారణ జరిపింది. ఈ అంశం ఒక అసాధారణ పరిస్థితికి సంబంధించిందన్నారు. ఎందుకంటే.. ఒక సాధారణ మహిళతోపాటు, దేశ ప్రధాని ఉన్న ఫొటోకు సంబంధించిన అంశమని కోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీ పోలీసులు ఈ విషయంలో సున్నితంగా వ్యవహరించకపోతే.. కోర్టు సున్నితంగా స్పందిస్తుందని తెలిపింది. ఈ అంశంలో సీజేపీ నేతలకు నోటీసులు జారీ చేసిన కోర్టు.. ఫొటోలు, దీనికి సంబంధించి అన్ని పోస్టులు తొలగించాలని సోషల్ మీడియా సంస్థ మెటాను ఆదేశించింది.
అలాగే, అన్ని వెబ్సైట్లలోంచి కూడా ఆ ఫొటోను తొలగించాలని సూచించింది. ఇందుకోసం ఒక్క రోజు గడువిచ్చింది. ఈ అంశంలో ఇప్పటికే ఢిల్లీ పోలీసులు సైబర్ పోలీస్ స్టేషన్లో ఐటీ యాక్ట, బీఎన్ఎస్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఢిల్లీ పోలీసులకు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. బాధిత మహిళకు రక్షణ కల్పించాలని కూడా ఢిల్లీ పోలీసులను కోర్టు ఆదేశించింది.