BRSV | అక్రమ అరెస్టులతో ప్రజావ్యతిరేకతను రూపుమాపలేరని భారత రాష్ట్ర సమితి వనపర్తి జిల్లా నాయకుడు కే శ్రీనివాసులు అన్నారు. అనంతరం శ్రీనివాసులు మాట్లాడుతూ.. విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 15% నిధులు కేటాయించాలని, పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఇచ్చిన పిలుపుమేరకు ఇవాళ అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన బీఆర్ఎస్వీ వనపర్తి జిల్లా నాయకుడు కే. శ్రీనివాసులు, కొత్తకోట బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకుడు వికాస్, మహేష్, రాజకుమార్, రవికుమార్, చంద్రశేఖర్, శివ తదితరులను ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారని శ్రీనివాసులు తెలిపారు.
అచ్చంపేటలో బీఆర్ఎస్వీ నేతల అరెస్ట్ :
అచ్చంపేట, మార్చి 22: తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల హక్కులను కించపరుస్తూ వారి గొంతును నొక్కే ప్రయత్నం చేస్తోందని అచ్చంపేట నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు రాకేష్ వర్మ ఆరోపించారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యా విభాగానికి కేవలం ₹23,108 కోట్లే కేటాయించడం దారుణమని విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్లో ఇది కేవలం 7% మాత్రమే, ఇది విద్యా అభివృద్ధిపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని రాకేష్ వర్మ తెలిపారు.
ఈ తక్కువ బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ ప్రశ్నించిన విద్యార్థులు, బీఆర్ఎస్వీ నేతలను ప్రభుత్వం ముందస్తుగా అరెస్ట్ చేసిందని రాకేష్ వర్మ మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో నిరసన హక్కును హరించడం దారుణమని, ఇది ప్రజాపాలన కాదని, నియంతృత్వ పాలన అని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నేతలు రాజు, శ్రీకాంత్‌లను ముందస్తుగా అరెస్ట్ చేశారని, ఇది విద్యార్థుల ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రభుత్వం వేసిన కుట్రగా పేర్కొన్నారు. విద్యా బడ్జెట్ పెంపుదల కోసం ప్రశ్నించేవారిని అరెస్టు చేయడం తగదని, విద్యార్థుల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని రాకేష్ వర్మ స్పష్టం చేశారు.
Hyderabad | ఎస్టీ హాస్టల్లో పురుగుల అన్నం.. రోడ్డెక్కిన విద్యార్థులు