Iran Attack : అమెరికా, ఇజ్రాయెల్ (USA, Israel) యుద్ధ విమానాలు ఇరాన్‌పై భీకరంగా విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ (Iran) సైతం ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగిస్తున్నది. శనివారం రాత్రి ఇరాన్ మరోసారి తమపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించినట్లు కువైట్ (Kuwait) రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ దాడుల్లో పలువురు తీవ్రంగా గాయపడగా.. అనేక భవనాలు దెబ్బతిన్నాయి.
డ్రోన్ల శకలాలు పడటంతో నగరంలోని సోషల్ సెక్యూరిటీ టవర్‌కు మంటలు అంటుకున్నట్లు కువైట్ రక్షణ శాఖ వెల్లడించింది. దానిలో అనేకమంది ప్రజలు చిక్కుకున్నారని, మంటలు ఆర్పడానికి అగ్నిమాపక దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. దాడులు కొనసాగుతున్నందున సురక్షితమైన ప్రదేశాల్లో తలదాచుకోవాలని కువైట్ సైన్యం ప్రజలకు సూచించింది. మరోవైపు ఆ దేశ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన ఇంధన ట్యాంకులు, పలు ప్రభుత్వ భవనాలకు అంటుకున్న మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చినట్లు అగ్నిమాపక దళం పేర్కొన్నది.
సౌదీ అరేబియా, ఖతార్లలోనూ దాడులు కొనసాగుతున్నాయి. గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తున్నందుకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ క్షమాపణలు చెప్పినప్పటికీ.. టెహ్రాన్ ఆయా దేశాలపై దాడులు కొనసాగిస్తుండటం గమనార్హం. మరోవైపు ఇరాన్‌కు మద్దతిస్తున్న హెజ్బొల్లా నేతలే లక్ష్యంగా దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. బీరుట్‌లోని హెజ్బొల్లా స్థావరాలను లక్ష్యం చేసుకుంటున్నందువల్ల ఆ ప్రాంతాన్ని వీలైనంత త్వరగా ఖాళీ చేయాలని స్థానికులను హెచ్చరించింది.