Marri Janardhan Reddy | బీఆర్ఎస్ పోరుబాట పేరుతో పాదయాత్ర చేయాలన్న నిర్ణయంతో మొద్దు నిద్రలేచిన రేవంత్ సర్కార్ రెండున్నర ఏళ్ల తర్వాత సమీక్షకు పూనుకుందని నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే 90 శాతం పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయకుండా విలువైన రెండున్నరేళ్ల సమయం వృధా చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టు వ్యయం పెరిగిపోతుందని ప్రాజెక్టు పనులు మిగిలిన 10 శాతం పూర్తి చేస్తే ఆ క్రెడిట్ అంతా కేసీఆర్ కు దక్కుతుందన్న అక్కసుతో ఉద్దేశపూర్వకంగా ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకొని వెళ్లడం లేదని మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు.
కాలువల టెండర్లను రద్దు చేయడం, రెండన్నరేళ్లుగా తట్టెడు మట్టి ఎత్తకపోవడం మీద ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నిలదీస్తున్న తరుణంలో సమీక్షల పేరుతో ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఒక్కనాడు పాలమూరు ప్రాజెక్టుల మీద సమీక్ష చేయలేదని, సొంత జిల్లాలోని ప్రాజెక్టులను, ప్రజలను పట్టించుకోకుండా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డల ముందుకు ఏ ముఖంతో వస్తారని ఆయన ప్రశ్నించారు.
కేసీఆర్ మీద కక్షతో రైతులను మోసం చేయవద్దని, పాలమూరుకు అన్యాయం చేయవద్దని రేవంత్ సర్కారుకు సూచించారు. ఇప్పటికే పనులు పూర్తి చేసి ఉంటే ఈ ఏడాది నార్లాపూర్తోపాటు ఏదుల, వట్టెం, కరివెనలో దాదాపు 45 టీఎంసీల వరకు నీటిని నింపుకునే అవకాశం ఉండేదని కృష్ణా నదిలో సమృద్ధిగా నీరు ఉన్న రెండున్నర సంవత్సరాల నిర్లక్ష్యం కారణంగా నీటిని వినియోగించుకునే పరిస్థితిలో లేకుండా పోయాయని విమర్శించారు. రెండున్నరేళ్లుగా ప్రాజెక్టు పనులను పడావు పెట్టడం మీద త్వరలో నార్లాపూర్ నుండి ఉదండాపూర్ వరకు పాదయాత్ర చేయాలని ఈ నెల 15న బీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవడంతో రేవంత్ రెడ్డి సర్కార్లో కదలిక వచ్చిందన్నారు.
ప్రజల్లో ప్రతిఘటన తప్పదని..
మహబూబ్ నగర్ లో సమావేశమై కార్యాచరణ ప్రకటించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉద్యమానికి సన్నద్ధం అవుతున్న తరుణంలో మేల్కొనడం జరిగిందన్నారు మర్రి జనార్దన్ రెడ్డి. పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి కేసీఆర్ ను తీసుకురావాలని ప్రతిపాదనలు చేయడంతో తమ తప్పిదాలు ఎక్కడ బయటపడతాయో అన్న కారణంతో సమీక్షకు పూనుకున్నారే తప్ప చిత్తశుద్ధిగా ఏ పార్టీ ఉంటుందో వేచి చూడాలన్నారు. రైతులు, ప్రజలను చైతన్యపరిచి ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించడంతో ప్రజల్లో ప్రతిఘటన తప్పదని కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు.
ఈ నేపథ్యంలోనే ఈ రోజు పాలమూరు ప్రాజెక్టుల మీద జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం సమీక్ష నిర్వహించారని మర్రి జనార్దన్ రెడ్డి విమర్శించారు. ఈ సమీక్ష మొక్కుబడిగా అన్న విధంగా కాకుండా క్షేత్రస్థాయిలో పనులు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతలలో పాడైన రెండు మోటార్లకు వెంటనే మరమ్మతులు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. మొత్తం అయిదు మోటార్లు నడిచేలా చర్యలు చేపట్టాలని కోరారు.
నార్లాపూర్ – ఏదుల – వట్టెం మధ్యలో ఆగిపోయిన పనులు పూర్తి చేసి ఈ ఏడాది నీటిని ఎత్తిపోసుకుని రిజర్వాయర్లు నింపేలా చర్యలు తీసుకోవాలని మర్రి జనార్దన్ రెడ్డి ప్రభుత్వానికి హితవు పలికారు. బీఆర్ఎస్ పోరుబాట నేపథ్యంలోనే ప్రభుత్వంలో కదలిక వచ్చింది. అయినా పనులు చేపట్టే వరకు బీఆర్ఎస్ కార్యాచరణ ఆగదు. ప్రభుత్వ నిర్వకాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టు పూర్తి చేసే వరకు తమ ఉద్యమం ఆగదని ఈ సందర్భంగా మర్రి జనార్దన్ రెడ్డి హెచ్చరించారు.