Bhuwan Chandra Khanduri : ఉత్తరాఖండ్ మాజీ సీఎం, మేజర్ జనరల్ (రిటైర్డ్).. భువన్ చంద్ర ఖండూరి (91) మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన డెహ్రడూన్‌లోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంపై ఉత్తరాఖండ్ ప్రజలు, నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలను కొనియాడుతున్నారు.
భువన్ చంద్ర మృతిపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు భర్తీ చేయలేదన్నారు. భారత రాజకీయాల్లోనే కాకుండా.. ఇండియన్ ఆర్మీకి కూడా భువన్ చంద్ర ఎనలేని సేవలు అందించారని సీఎం అన్నారు. ప్రజల హృదయాల్లో ఆయన స్థానం చిరస్థాయిగా నిలిచేలా ప్రభుత్వం తరఫున కార్యక్రమాలు చేపడుతామన్నారు. ఆయన ఆత్మశాంతి కోసం ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
రాజకీయ ప్రస్థానం
భువన్ చంద్ర బీజేపీలో సుదీర్ఘ కాలం పని చేశారు. ఉత్తారఖండ్కు రెండుసార్లు సీఎంగా పని చేశారు. 2007 నుంచి 2009 వరకు, 2011 నుంచి 2012 వరకు సీఎంగా పని చేశారు. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌లోని ఐదు స్థానాల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థులు ఓడిపోయారు. దీంతో ఈ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తన సీఎం పదవికి 2009లో రాజీనామా చేశారు. అనంతరం 2011లో బీజేపీ అధిష్టానం భువన్ చంద్రనే తిరిగి సీఎంగా నియమించింది. అంతకుముందు ఏబీ వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రిగా క్యాబినెట్లో సేవలందించారు. భువన్ చంద్ర రాజకీయాల్లోకి రాకముందు ఇండియన్ ఆర్మీలో మేజర్ జనరల్‌గా కూడా పని చేశారు. అప్పట్లో అందరూ ఆయనను జనరల్ సాబ్ అని పిలిచేవారు. 16వ లోక్‌సభ ఎన్నికల్లో గర్వాల్ స్థానం నుంచి ఎంపీగా కూడా గెలిచారు.