పాలమూరు మహానగరం దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్నది. గ్రేడ్-1గా ఉన్న మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా మారితే రాష్ట్రంలోని నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందనున్నది. విలీన గ్రామాలతో కలిపి 3.20 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. ఇప్పటికే మహబూబ్‌నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుతో స్వరూపమే మారింది. సీఎం కేసీఆర్ ఆశీస్సులు, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చొరవతో మెడికల్, పర్యాటక, పారిశ్రామిక హబ్‌గా విస్తరిస్తున్నది. ఇంకా పట్టణం నలుదిక్కులా బైపాస్ రోడ్లకు అనుమతులు లభించాయి. కేసీఆర్ ఎకో అర్బన్ పార్కు, పాలమూరు యూనివర్సిటీ, సమీకృత కలెక్టరేట్, మినీ ట్యాంక్‌బండ్, శిల్పారామం జిల్లాకే తలమానికంగా నిలిచాయి. తాజాగా ప్రభుత్వం ఆర్థిక గణంకాల మేరకు జిల్లా తలసరి ఆదాయం రాష్ట్రంలోని ప్రధాన నగరాలతో పోటీ పడుతున్నట్లు తేలింది. ఇక కార్పొరేషన్‌గా మారితే ప్రగతి పరుగులు పెట్టనున్నది.
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి): పాలమూరు దశదిశ మారుతున్నది. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. గ్రేడ్ 1 మున్సిపాలిటీగా ఉన్న పాలమూరును కార్పొరేషన్‌గా మారితే తెలంగాణలో టాప్ సిటీలో ఒకటిగా మారుతుంది. తెలంగాణ ఏర్పడ్డాక మున్సిపల్ చట్టాన్ని సవరించి సమీప గ్రామాలను పట్టణాలకు కలిపి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేశారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్(జీహెచ్ఎంసీ)తో సహ జంటనగరాల చుట్టుపక్కల ఆరు కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్, రామగుండం, నిజామాబాద్ కార్పొరేషన్ హోదా కలిగి ఉన్నాయి. వీటి సరసన పాలమూరు పట్టణం త్వరలో చేరబోతున్నది. ఇప్పటికే మహబూబ్‌నగర్ అర్బన్ డెవలప్మెంట్ ఆథారిటీని ఇటీవలే ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్, భూత్పూర్, జడ్చర్ల మున్సిపాలిటీలను కలిపి ముడా ఆవిర్భవించింది. కార్పొరేషన్ కావాలంటే 3లక్షలకు మించి జనాభా ఉండాలి. ప్రస్తుత అధికారిక లెక్కల ప్రకారం మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ జనాభా 3లక్షల 20వేలకు పెరిగింది. ఎనిమిదేండ్లుగా మహబూబ్‌నగర్ పట్టణం విస్తరిస్తున్నది. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రత్యేక చొరవ తీసుకొని పట్టణ అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నారు. టూరీజం, మెడికల్, పారిశ్రామిక హబ్‌లను విస్తరిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం కూడా ఊహించని విధంగా హైదరాబాద్ పట్టణంతో పోటీ పడుతున్నది. సమీకృత కలెక్టరేట్, పాలమూరు యూనివర్సిటీ, కోర్టు భవన నిర్మాణాలు, మహబూబ్‌నగర్ -చించోలి జాతీయ రహదారికి గ్రీన్‌సిగ్నల్ లభించడం, మెడికల్ కళాశాల, కేసీఆర్ ఎకో పార్కు కావడంతో చుట్టుపక్కల భూముల ధరలకు రెక్కలొచ్చాయి. నాలుగు దిక్కల బైపాస్ రహదారులకు కూడా అనుమతి లభించడంతో పాలమూరు పట్టణం శరవేగంగా అభివృద్ధిలో దూసుకుపోతుందని విశ్లేషకులు అంటున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా తలసరి ఆదాయంలో ప్రధాన నగరాలతో సమానంగా పోటీపడుతన్నదని తేలింది. దీంతో కార్పొరేషన్ అయితే పాలమూరు స్వరూపమే మారిపోతుంది.
చిన్న జిల్లాలు ఏర్పాటయితే అభివృద్ధి కుంటుపడుతుందని, జిల్లాకేంద్రంలో నివాసం ఉండరని ఎద్దేవా చేసిన వారంతా ఆశ్చర్యపోయేలా పాలమూరు రోజురోజుకూ విస్తరిస్తున్నది. జిల్లాకేంద్రం చుట్టుపక్కల 10కిలోమీటర్ల పరిధిలో భూములు దొరకని పరిస్థితి ఏర్పడింది. గజం విలువ రూ.25 నుంచి 50వేలకు పలుకుతుంది. ఇక టౌన్లో రూ.లక్ష పెట్టినా గజం భూమి దొరకడం లేదు. మరోవైపు జడ్చర్ల -మహబూబ్‌నగర్ మధ్య నాలుగులైన్ల (నెం.167) జాతీయ రహదారి పూర్తి కావడం, ఏనుగొండ బైపాస్ పూర్తికావడం, క్రిస్టియన్‌పల్లి నుంచి ధర్మాపూర్ సమీపం నుంచి అక్కడి నుంచి చిన్నదర్పల్లి వరకు బైపాస్ రహదారి పనులు ప్రారంభమయ్యాయి. రెండు నెలల కిందట సీఎం కేసీఆర్ సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించారు. ఇటీవలే మహబూబ్‌నగర్-చించోలి రహదారికి ప్రభుత్వం రూ.780కోట్లు వెచ్చించడం, పీయూ సమీపంలో జిల్లా కోర్టు కాంప్లెక్స్, మెడికల్ కళాశాల, కేసీఆర్ ఎకో పార్కు నిర్మాణం కావడంతో చుట్టుపక్కల భూములకు రెక్కలొచ్చాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకున్నది. అనేక వెంచర్లు వెలియడంతో చుట్టుపక్కల స్థలాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి ఎద్దడికి కేరాఫ్‌గా మారి.. రహదారులు, డ్రైనేజీలు, ఇరుకైన జంక్షన్లతో ఆధ్వానంగా ఉన్న పాలమూరు పట్టణం తెలంగాణ వచ్చాక స్వరూపమే మారిపోయింది. 2014నుంచి ఇప్పటివరకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రత్యేక చొరవ తీసుకొని వేల కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధికి బాటలు వేశారు. పారిశ్రామికంగా, వైద్య, విద్య, టూరిజం, రహదారులు, జంక్షన్ల అభివృద్ధి పట్టణ సుందరీకరణతో శరవేగంగా సాగుతున్న అభివృద్ధి విమర్శకుల నోళ్లు మూయించింది. పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, ఆరోగ్య సంరక్షణ, విద్యాసంస్థల నిర్వహణ, గృహనిర్మాణాలు, రవాణా సౌకర్యం జిల్లాకేంద్రం దశను మార్చివేశాయి. పాలమూరులో ఉండాలంటే భయపడే వాళ్లు ఇప్పుడు ఇక్కడే ఉండటానికి ఉవ్విళ్లురూతున్నారు. దీంతో సవరించిన మున్సిపల్ చట్టం ప్రకారం కార్పొరేషన్ స్థాయికి తీసుకెళ్లేలా చేశాయి. ఆధునిక హంగులతో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లు కూడా పూర్తయితే పట్టణ స్వరూపమే మారుతుంది. ఎకో పార్కు, పిల్లలమర్రి, మినీ ట్యాంక్‌బండ్, మన్యంకొండ దేవస్థానం వద్ద రోప్‌వే ఏర్పాటు చేయనుండటంతో రూపురేఖలే మారిపోతాయి. పట్టణ జనాభాకు అనుగణంగా అధికారులు నిత్యం మిషన్‌భగీరథ నీళ్లను అందిస్తున్నారు. డ్రైనేజీలు, గల్లీ రహదారులు, ప్రధాన రహదారుల మధ్య డివైడర్లు, మొక్కల పెంపకం పట్టణ సుందరీకరణకు అద్దం పడుతుంది. పాత కలెక్టరేట్లో కొత్తగా సూపర్ స్పెషాలిటీ దవాఖాన, బస్టాండ్ ఆధునీకరణ పనులు, కొత్తగా ప్రైవేట్ సెక్టార్లో మాల్స్, మల్టిఫ్లెక్స్‌లో నిర్మాణం జరగుతుండగా.. మరికొన్ని ప్రతిపాదనల్లో ఉన్నాయి. పెరుగుతున్న జనాభా కాలనీలకు అనుగుణంగా కొత్త మాస్టర్‌ప్లాన్ సిద్ధమవుతున్నది. కంపెనీల రాక మొదలైతే పారిశ్రామిక అభివృద్ధికి హద్దులే ఉండవు.
పాలమూరు పట్టణం అభివృద్ధిలో రాజీపడేది లేదు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో పట్ణణ ప్రణాళికను ముందుకు తీసుకెళ్తాం. భూ వినియోగం, భవనాల నిర్మా ణం, ఆర్థిక, సామాజికరంగాల్లో అభివృద్ధికి దోహదపడుతుంది. జిల్లాకేంద్రంలో నిత్యం నీటి సరఫరా, ప్రజారోగ్యానిక ప్రాధాన్యత ఇస్తున్నాం. పర్యావరణ అంశాలను ప్రోత్సహిస్తూ పట్టణాన్ని సుందరీకరిస్తున్నాం. పట్టణ పేదరిక నిర్మూలన, మురికివాడలు లేకుండా నవీకరిస్తున్నాం. స్ట్రీట్‌లైట్లు, పార్కింగ్ స్థలాలు, బస్స్టాప్లతోపాటు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించి కార్పొరేషన్ స్థాయికి తీసుకెళ్తా.
– శ్రీనివాస్‌గౌడ్, ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి
మహబూబ్‌నగర్ అర్బన్ డెవలప్మెంట్ ఆథారిటీని ఏర్పాటు చేయడంతో జిల్లా స్వరూపం మారిపోయింది. జిల్లాలో మహబూబ్‌నగర్, జడ్చర్ల, భూత్పూర్ మున్సిపాలిటీలు దగ్గరదగ్గరలో ఉన్నాయి. సుమారు 15కిలోమీటర్ల పరిధిలోనే ఈ మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. భూత్పూర్, జడ్చర్ల మున్సిపాలిటీలు జాతీయ రహదారిని ఆనుకొని ఉండగా.. మహబూబ్‌నగర్ జాతీయ రహదారికి కనెక్టివిటీ ఏర్పడింది. దీంతో ఈ మూడింటిని మూడా పరిధిలోని తీసుకొచ్చారు. దీంతో పెద్దపెద్ద సంస్థలు వెంచర్లను ఏర్పాటు చేస్తున్నాయి. ముడా వల్ల ప్లాట్లు పొందిన జనాలకు భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అంతేకాక విశాలమైన రహదారులు, డ్రేనేజీ, ఎలక్ట్రికల్, పార్కుల అభివృద్ధి మున్సిపాలిటీలతో సంబంధం లేకుండా ఏర్పాటవుతాయి. ఎకరాకు రూ.లక్ష అభివృద్ధి నిధుల కింద మున్సిపాలిటీలకు జమవుతాయి. భూహక్కుపత్రాలు, ఈసీ, అర్బన్‌ల్యాండ్ సీలింగ్ మినహాయింపు సర్టిఫికెట్లు ఇవ్వాలి. వెంచర్లు చేయాలంటే భూసేకరణ పరిధిలోకి రాదని ముందే తాసిల్దార్ ఇచ్చిన ఎన్వోసీ, రెసిడెన్షియల్ పరిధిలోకి భూమిని బదాలాయించి.. హేవీ ఎలక్ట్రిక్ వైర్లు లేవని సంబంధిత అధికారితో నిర్ధారణ పత్రం, 10శాతం భూమిని మున్సిపల్‌కు కేటాయించి, 40ఫీట్ల విశాలమైన రహదారులు వేసి, 10టన్నుల లారీ వెళ్లినా కుంగకుండా ఉండేలా నిర్మాణం చేశాక, రహదారి పక్కన మొక్కలు నాటే పనులన్నీ పూర్తయ్యాక ముడా అనుమతి ఇస్తుంది. దీంతో ముడా ఏర్పాటుతో మున్సిపాలిటీల్లో వెలిసే వెంచర్లు జనాలకు ఇబ్బంది లేకుండా చేస్తాయి. దీంతో ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.