మహబూబ్నగర్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : అచ్చంపేట ఆర్డీవోగా పనిచేస్తున్న మాధవి 24గంటల్లోనే తన బదిలీని నిలుపుకొన్నారు. ఆర్డీవో మాధవిపై అనేక ఆరోపణలు, ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారులు నాగర్కర్నూల్ పీఆర్ఎల్ఐఎస్ యూనిట్ -11కు బదిలీ చేశారు. బదిలీ చేస్తూ ఎల్ఆర్ నెం.ఎ4/1440/2025 హైదరాబాద్ సీసీఎల్ఏ ప్రధానకార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. నాగర్కర్నూల్ పీఆర్ఎల్ఐఎస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ యాదగిరిని అచ్చంపేట ఆర్డీవోగా బదిలీ చేశారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం అచ్చంపేట ఆర్డీవోగా జాయిన్ కావడానికి వచ్చిన యాదగిరిని జాయిన్ కానివ్వకుండా చార్జీ ఇవ్వకుండా తిరిగి పంపించారు. అధికార పార్టీ నేతల అండతో ఉన్నతాధికారులకు ఒత్తిడి పెంచి తన బదిలీ నిలుపుకోవడంపై రెనెన్యూ వర్గాలు పలువిధాలుగా చర్చించుకుంటున్నారు. ఆర్డీవో బదిలీ నిలుపుదల వెనుక అధికారపార్టీకి చెందిన ఓ బడా నేత ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. ఉన్నతాధికారుల ఉత్తర్వులను లెక్కచేయకుండా రాజకీయ అండతో తిరిగి అచ్చంపేట ఆర్డీవోగా తన ప్రయత్నాలు సఫలం కావడంతో ఆర్డీవో బాధితులు ఆందోళన చెందుతున్నారు. అచ్చంపేట ఆర్డీవో మాధవిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. కోర్డు ఆదేశాలను కూడా ధిక్కరించిన సందర్భాల్లో కోర్టుకు జరిమానా కట్టిన కేసులు కూడా ఉన్నాయి.
కార్యాలయానికి వెళ్లే ప్రజలతో దురుసుగా ప్రవర్తిస్తారని అనేక ఫిర్యాదులు ఉన్నాయి. ఆర్డీవోపై జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులకు అనేక ఫిర్యాదులు వెళ్లినా ఉన్నతాధికారులు అనేక సార్లుమందలించిన పట్టించుకోకుండా రాజకీయ అండతో పనిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆర్డీవో కార్యాలయంలో పనిచేసే కందిస్థాయి అధికారులు, సిబ్బందిని ఇబ్బందులకు గురిచేయడం, ఇష్టానుసారంగా బూతులు తిట్ట డం, కించపర్చేవిధంగా మాట్లాడడం వల్ల ఆమె వద్ద పనిచేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. కార్యాలయంలో పనిచేస్తున్న కిందిస్థాయి ఉద్యోగులు, సిబ్బందిచే తమ ఇంట్లో పనులు చేయించుకోవడం, బట్టలు ఉతికించుకోవడం ఇంట్లో పని చేయడానికి వెళ్లకుంటే బదిలీ చేయిస్తాను, సరేండర్ చేస్తాను అని బెదిరింపులకు పాల్పడుతుందని సమాచారం.
ఆర్డీవో వేధింపులు భరించలేక రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది రెవెన్యూ ఎంప్లాయీస్ యూ నియన్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం. ఆర్డీవో అచ్చంపేటలో కొన్నెండ్లుగా వివాదాల్లో ఉన్న విలువైన భూములను ఏకపక్షంగా తీర్పు ఇచ్చినట్లు అనేక అనుమానాలు ఉన్నాయి. కలెక్టర్ కూడా ఆర్టీవో పనితీరుపై అనేక సార్లు మందలించినట్లు సమాచారం. అయినా అచ్చంపేట ఆర్డీవో మాధవి తీరు మారకపోవడంతో పాటు అనేక ఫిర్యాదులు పెరుగుతుండడంతో ఉన్నతాధికారులు బదిలీ చేశారు. ఆర్డీవో బదిలీ అయ్యారనే వార్త తెలియడంతో అచ్చంపేట డివిజన్ పరిధిలో మండలాల్లో పనిచేస్తున్న మండల రెనెన్యూ అధికారులు, సిబ్బంది సంబురపడ్డారు. 24గంటల్లోనే అధికారబలంతో బదిలీ నిలుపుకోవడంపై సంబురపడ్డ అధికారుల్లో ఆందోళన మొదలైంది.
ఈ ఆర్డీవో వద్ద పనిచేసేందుకు కిందిస్థాయి అధికారులు, ఉద్యోగులు భయపడుతున్నారు. సెలవులు పెట్టడం లేక వేరే మండలాలకు బదిలీపై వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఆర్డీవో మాధవి పనితీరు వల్ల కలెక్టర్కు కూడా తలనొప్పిగా మారిందని కొందరు అధికారులు చెబుతున్నారు. కలెక్టర్ కూడా ఏమి చేయలేకపోతున్నారని తెలిసింది. కలెక్టర్ కూడా ఆర్డీవోపై వచ్చిన ఫిర్యాదులు తదితర అంశాలపై ఉన్నతాధికారులకు నివేదిక పంపించినట్లు రెనెన్యూ అధికారులు అంటున్నారు.
ఆ అధికారి ఆర్డీవోగా ఉన్నట్లా.. బదిలీ అయినట్లా?
అచ్చంపేట ఆర్టీవో మాధవి బదిలీ రద్దు అయినట్లు ఉన్నతాధికారుల నుండి ఎలాంటి ఉత్తర్వులు రాలేదని తెలిసింది. అయితే మం గళవారం సాయంత్రం ఎన్నికల కోడ్ విడుదల కావడంతో ఇప్పుడు ఎలాంటి బదిలీల ఉత్తర్వులు ఇవ్వడానికి అవకాశం ఉండదు. అయితే ఎన్నికల కోడ్ రావడంతో బదిలీని నిలుపుదల చేస్తూ ఎలాంటి ఉత్తర్వులు విడుదల కానందున అచ్చంపేట ఆర్డీవోగా మాధవి కొనసాగనున్నారా? లేక బదిలీ అయిన స్థానానికి వెళ్లాల్సి ఉంటుందా? అనేది ఉన్నతాధికారులు తేల్చాల్సి ఉన్నది. ఆర్డీవో వ్యవహరంపై మండలాల తాసీల్దార్లు, కిందిస్థాయి ఉద్యోగులు, సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. అయితే ఈ అధికారి వద్ద పనిచేయలేమం టూ.. ఈ అధికారి మాకొద్దు అంటూ ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఉద్యోగ సంఘాలతో చర్చిస్తున్నట్లు తెలిసింది. ఆర్డీవో బాధితులు కూడా ఆందోళన చేసేందుకు సిద్ద్ధమవుతున్నట్లు సమాచారం.