ఆదిలాబాద్, మార్చి 8(నమస్తే తెలంగాణ) ; రోజురోజుకు భారీగా పెరుగుతున్న నిత్యావసర, ఇతర సరుకులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు గృహావసరాల సిలిండర్ ధర ఏకంగా రూ.60 పెరగడంతో పేదలు, మధ్య తరగతి ప్రజలు నష్టపోవాల్సిన దుస్థితి నెలకొన్నది. అమెరికా, ఇజ్రాయిల్ దేశాలతో ఇరాన్‌కు జరుగుతున్న యుద్ధ ప్రభావం కారణంగా సిలిండర్ ధర పెరిగినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటడంతో జనం ఆర్థికంగా నష్టపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 2,88,346 వంట గ్యాస్ కనెక్షన్లు ఉండగా ఇందులో జనరల్ కనెక్షన్లు 2,05, 250, దీపం కనెక్షన్లు 46,136, ఉజ్వల పథకం కింద 36,960 కనెక్షన్లు ఉన్నాయి. గృహావసర వియోగదారులు 14.2 కిలోల సిలిండర్‌ను వినియోగిస్తుండగా.. ధర పెరగక ముందు అసలు ధర(బిల్లుపై వచ్చేది) రూ.932 ఉండగా రవాణా ఛార్జీలతో కలిపి రూ.970 వసూలు చేసేవారు. ఇప్పుడు ఏకంగా రూ.60 పెరగడంతో వినియోగదారులు రూ.1030 చెల్లించాల్సి ఉంటుంది.
రూ.1.50 కోట్ల భారం
ప్రతి నెల వంట గ్యాస్ వినియోగదారులు వారి అవసరాల మేరకు 1 నుంచి రెండు సిలిండర్లను వాడుతారు. పెరిగిన ధరల ఫలితంగా ఆదిలాబాద్ జిల్లాలోని పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రతి నెల రూ.1.44 కోట్ల భారం పడనుంది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500 సిలిండర్ అందిస్తామని ప్రకటించినా.. అమలులో అర్హులకు సర్కారు సబ్సిడీ అందడం లేదు. వివిధ కంపెనీలకు చెందిన గ్యాస్ సిలిండర్ల బాయ్‌లు వినియోగదారుల వద్ద నుంచి అదనంగా రూ.40 వసూలు చేస్తున్నా అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు నష్టపోవాల్సి వస్తున్నది.
ధర తగ్గించాలని ఆందోళన
పెరిగిన సిలిండర్ ధర తగ్గించాలంటూ ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలో సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేశ్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యుద్ధ సమయంలో అనాలోచిత నిర్ణయాల కారణంగా గ్యాస్ ధరలు పెరిగాయన్నారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ మిత్రదేశమైన ఇరాన్‌కు మద్దతు తెలపకుండా ఇజ్రాయిల్ అమెరికాకు మద్దతు ఇస్తున్నారన్నారు. దీంతో ఇరాన్ చమురు ట్యాంకర్లను భారత్‌కు అనుమతించడం లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం విదేశాంగ విధానాన్ని మార్చుకొని ఇరాన్‌కు మద్దతు తెలిపాలని, చమురు ట్యాంకర్లను విడిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో సీనియర్ నాయకుడు బండి దత్తాత్రి, నాయకులు పూసం సచిన్, సురేందర్, మంజుల, ఆరిఫా, రాధా, గంగారం, రాములు పాల్గొన్నారు.