Tamil Nadu : తమిళనాడు ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. విజయ్ టీవీకే ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ఇది. తమిళనాడు ఆర్థిక శాఖ మంత్రి ఎన్ మేరీ విల్సన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2036లోపు తమిళనాడు ఆర్థిక వ్యవస్థను 1.5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా కీలక పథకాల్ని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పిల్లలు పుడితే వారికి ఒక గ్రామ్ బంగారం అందించే పథకాన్ని కూడా ప్రభుత్వం అమలు చేయనుంది.
ఈ బడ్జెట్లోని కొన్ని కీలక అంశాలివి. ‘తాయ్ మామన్ తంగా మోతిరం తిట్టం’ పథకం కింద ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించే ప్రతి బిడ్డకు 1 గ్రామ్ బంగారు ఉంగరాన్ని అందిస్తారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఆర్థిక సాయాన్ని పెంచనున్నారు. దీనివల్ల 1.93 లక్షల కుటుంబాలకు ప్రతి ఏటా రూ.7,000 వరకు ఆర్థిక సాయం అందిస్తారు. ఇందుకోసం రూ.135 కోట్లు కేటాయించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ‘అన్నన్ సీర్ తిట్టమ్ అనే పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనికింద వధువుకు 8 గ్రాముల బంగారంతోపాటు ఒక పట్టుచీరను అందిస్తారు. వెట్రి ల్యాప్‌టాప్ స్కీమ్ కింద అర్హులైన పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందజేస్తారు. రైతులకు విద్యుత్ సబ్సిడీ కింద రూ.7,432 కోట్లు కేటాయించింది. రైతులు, వ్యవసాయ రంగం సంక్షేమానికి రూ.14,984 కోట్లు కేటాయించింది. అరివగం పేరుతో దేశంలోనే మొదటి ఏఐ అండ్ ఇన్నోవేషన్ సిటీని ఏర్పాటు చేస్తారు. అలాగే, తూతుకుడి, తిరునెల్వేలి ప్రాంతాల్ని స్పేస్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ జోన్‌గా ప్రకటించారు.
మహిళా సాధికారతలో భాగంగా స్వయం సహాయక గ్రూపులకు రూ.38,000 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ ఉద్యోగులకు అందించే హెల్త్ ఇన్సూరెన్స్ స్కీంను రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షలకు పెంచబోతున్నారు. గరిష్టంగా రూ.12 లక్షలతో మరో హెల్త్ ఇన్సూరెన్స్ స్కీం కూడా ఉంది. 12 జిల్లాల్లో 12 వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తారు. మధురైలో ప్రత్యేక లా కాలేజీని ఏర్పాటు చేస్తారు. 2027-28 విద్యాసంవత్సరం నుంచి ఇది ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో ఉన్నత విద్య కోసం రూ.8,393 కోట్లు కేటాయించారు. అలాగే, కొత్తగా ఐదు ఐటీఐలను ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ స్కూళ్లలో 11వ తరగతి చదివే విద్యార్థులకు హెల్మెట్, లైట్స్, వాటర్ బాటిల్స్‌తో కూడిన సైకిళ్లు అందజేస్తారు.