Ind vs US : రష్యా (Russia) నుంచి చమురు, సహజవాయువు కొనుగోలు చేస్తున్న భారత్ (India), చైనా (China) వంటి దేశాలకు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సర్కారు హెచ్చరికలు చేసింది. రష్యాపై ఆధారపడటం తగ్గించుకోకపోతే అసాధారణమైన ఆర్థిక ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది. రష్యా చమురును ఇతర దేశాలు కొనుగోలు చేయకుండా కొత్త ఆంక్షలతో కూడిన బిల్లును యూఎస్ కాంగ్రెస్ (US Congress) ఆమోదించిన నేపథ్యంలో తాజా పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అమెరికన్ కాంగ్రెస్‌లో రిపబ్లికన్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంటల్ మాట్లాడుతూ.. ‘భారత్, చైనాలకు మా సందేశం ఒక్కటే. మీ పద్ధతి మార్చుకోండి. మీకు కావాల్సిన చమురు, గ్యాస్‌ను వేరే దేశాల నుంచి కొనండి. బుజ్జగింపులు సరైన వ్యూహం కాదు’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ కొత్త ఆంక్షల ద్వారా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను చర్చలవైపు నెట్టి, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. “పుతిన్, మా దగ్గర నీ నంబర్ ఉంది. ఉక్రెయిన్.. మీరు ఒంటరి కాదు” అని ఆయన అన్నారు.
‘లిండ్సే ఓ గ్రాహం సాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026’ పేరుతో రూపొందించిన ఈ చట్టం, రష్యా అధికారులు, బ్యాంకులు, అలాగే రష్యా ఇంధనాన్ని ప్రపంచవ్యాప్తంగా రవాణా చేస్తున్న ‘షాడో ఫ్లీట్’ (రహస్య ట్యాంకర్ల వ్యవస్థ) పై కఠిన ఆంక్షలు విధిస్తుంది. ఈ చట్టం ప్రకారం.. రష్యా నుంచి అత్యధికంగా చమురు, గ్యాస్ దిగుమతి చేసుకుంటున్న మొదటి ఐదు దేశాలపై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి కట్టబెడుతుంది. ఈ జాబితాలో భారత్, చైనాలు ప్రధానంగా ఉన్నాయి.
అయితే రష్యా గ్యాస్ ఎగుమతుల్లో 15 శాతం కంటే తక్కువ దిగుమతి చేసుకుంటూ వాటిని తగ్గించడానికి గణనీయమైన చర్యలు తీసుకున్న దేశాలకు మినహాయింపు ఇచ్చారు. ఈ బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభలో 262-159 ఓట్ల తేడాతో ఆమోదం లభించింది. ప్రస్తుతం ఇది అధ్యక్షుడు ట్రంప్ సంతకం కోసం వేచి ఉంది. అమెరికా హెచ్చరికలపై భారత ప్రభుత్వం తీవ్రంగా, స్పష్టంగా స్పందించింది. తమ దేశ ప్రజల ఇంధన భద్రతకు కట్టుబడి ఉన్నామని, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వివిధ దేశాల నుంచి ఇంధన సరఫరాలను కొనసాగిస్తామని స్పష్టంచేసింది.
అమెరికా తీసుకుంటున్న ఇలాంటి చర్యలు ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తాయని తాము ముందుగానే వాషింగ్టన్‌ను హెచ్చరించినట్లు న్యూఢిల్లీ పేర్కొంది. ఈ బిల్లు ఆమోదాన్ని గమనించామని, దీనివల్ల ద్వైపాక్షిక సంబంధాలపై, అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పై పడే ప్రభావం గురించి గత కొన్ని నెలలుగా అమెరికన్ అధికారులతో జరిగిన చర్చల్లో చాలా స్పష్టంగా వివరించామని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారత వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కూడా ఆ ప్రకటనలో ప్రభుత్వం స్పష్టంచేసింది.
దేశంలోని వాణిజ్య, పారిశ్రామిక సంస్థలతో కలిసి ఈ చట్టంవల్ల కలిగే పరిణామాలను ఎదుర్కొంటామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. తమ భారీ జనాభా, ఆర్థిక వ్యవస్థ అవసరాల దృష్ట్యా సురక్షితమైన, సరసమైన, నమ్మకమైన ఇంధన సరఫరాలు అత్యవసరమని భారత్ తన వైఖరిని తెలియజేసింది.