Meals | భారతీయ సంప్రదాయంలో నేలపై కూర్చొని భోజనం చేయడం ఒక సాధారణ అలవాటు. అయితే ఆధునిక జీవనశైలిలో టేబుల్, కుర్చీలపై కూర్చొని భోజనం చేయడం ఎక్కువైంది. దీంతో నేలపై కూర్చొని తినే పద్ధతి పాతకాలపు ఆచారంగా చాలామంది భావిస్తున్నారు. కానీ ఆయుర్వేదం ప్రకారం నేలపై కూర్చొని భోజనం చేయడం కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా అనేక విధాలుగా మేలు చేసే అలవాటు అని పేర్కొంటోంది. ఆయుర్వేదంలో సూచించే విధంగా నేలపై పద్మాసనం లేదా సుఖాసనం మాదిరిగా కాళ్లు మడిచి కూర్చొని భోజనం చేయడం జీర్ణక్రియకు అనుకూలంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ భంగిమలో కూర్చోవడం వల్ల శరీరం ఆహారాన్ని జీర్ణం చేసుకునేందుకు సిద్ధమవుతుందని అంటున్నారు. భోజనం చేసే సమయంలో ముందుకు వంగి ఆహారం తీసుకుని మళ్లీ నిటారుగా కూర్చోవడం వల్ల పొత్తికడుపు కండరాలు చురుకుగా పనిచేసి జీర్ణక్రియకు తోడ్పడతాయని ఆయుర్వేదం వివరిస్తోంది.
నేలపై కూర్చొని భోజనం చేయడం బరువు నియంత్రణకు కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఎక్కువగా తినడానికి ప్రధాన కారణాల్లో ఒకటి కడుపు నిండిన సంకేతాలను సరిగ్గా గుర్తించకపోవడమే. నేలపై కూర్చొని తినడం వల్ల శరీరం ఆ సంకేతాలను మెరుగ్గా గుర్తించే అవకాశం ఉండి, అవసరానికి మించి తినే అలవాటు తగ్గుతుంది. ఈ అలవాటు శరీరానికి బలం, వశ్యతను కూడా పెంచుతుంది. నేలపై కూర్చోవడం వల్ల మోకాళ్లు, తుంటి భాగం, వెన్నెముక, ఛాతీ, చీలమండల కండరాలు సాగి మరింత సులభంగా కదిలేలా మారుతాయి. అలాగే ఎక్కువసేపు కుర్చీలో కూర్చోవడం వల్ల వచ్చే వెన్నునొప్పి, తుంటి భాగంలో బిగుతు వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉందని చెబుతారు.
కాళ్లు మడిచి కూర్చున్న స్థితి నుంచి ఎలాంటి ఆధారం లేకుండా సులభంగా లేవగలిగే వారు ఎక్కువ కాలం జీవించే అవకాశాలు ఉంటాయని ఒక పరిశోధనలో తేలింది. ఈ సామర్థ్యం శరీర బలం, సమతుల్యత, వశ్యతకు సూచికగా ఉంటుంది. నేలపై కూర్చోవడం వల్ల మోకాళ్లు, తుంటి కీళ్లు చురుకుగా పనిచేస్తాయి. ఈ భంగిమలో కూర్చోవడం వల్ల తుంటి, కాళ్లు, పెల్విస్ భాగం బాగా సాగడంతోపాటు కోర్ కండరాలు, చీలమండలు కూడా బలపడతాయి. కీళ్లను తరచూ కదిలించడం వల్ల వాటి పనితీరు మెరుగుపడి, నడవడం లేదా కూర్చోవడంలో ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుంది. జీర్ణక్రియ సక్రమంగా జరగాలంటే జీర్ణవ్యవస్థకు సరైన రక్తప్రసరణ అవసరం. నేలపై కూర్చొని భోజనం చేయడం ద్వారా రక్తప్రసరణ జీర్ణవ్యవస్థకు అనుకూలంగా ఉంటుంది. కుర్చీలో కూర్చొని భోజనం చేయడంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. నేలపై కూర్చొని ప్రశాంతంగా భోజనం చేయడం శరీరానికే కాకుండా మనసుకు కూడా ప్రశాంతతను కలిగిస్తుంది. ప్రశాంతమైన మనసు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అందువల్ల ఈ అలవాటు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఒకేసారి మేలు చేసే సంప్రదాయ పద్ధతిగా మారింది.