మహబూబ్నగర్, నవంబర్ 24 : ఠాగూర్ సినిమాలోని సన్నివేశాన్ని తలపించేలా.. మహబూబ్నగర్ (Mahabubnagar) జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖాన (Private Hospital) వైద్యులు వ్యవహరించారు. జ్వరం వచ్చిందని మహిళ దవాఖానకు వెళ్తే.. ఐసీయూలో (ICU) ఉంచి వైద్యం అందిస్తున్నట్టు నమ్మిం చి.. డబ్బులు కట్టించుకున్న తర్వాత.. పరిస్థితి విషమించి మృతి చెందిందని చావు కబురు చల్లగా చెప్పిన ఘటన మహబూబ్నగర్లో చోటుచేసుకున్నది. మృతురాలి కుటుంబ స భ్యుల కథనం మేరకు.. మహబూబ్నగర్ మండలం కోడూర్కు చెందిన లలిత(35)కు జ్వరం రావడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో ఈ నెల 21న అడ్మిట్ అయ్యింది.
పరీక్షించిన వైద్యులు మహిళ ఊపిరితిత్తుల్లో వాటర్ ఉందని, వెంటనే తీయాలని, లేకుంటే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం ఆమె మృతి చెందగా ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టు కుటుంబ సభ్యులకు చూపించారు. రూ.3 లక్షలకుపైగా బిల్లు చెల్లించిన తర్వాత మృతిచెందిన విషయాన్ని తెలిపారు. దీంతో సోమవారం మృతురాలి కుటుంబీకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో దవాఖానకు చేరుకొని ఆందోళనకు దిగారు. పరిస్థితి విషమించి చనిపోయినా చెప్పకుండా నాటకం ఆడుతూ డ బ్బులు దండుకున్నారని దాడికి యత్నించారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు చేరుకోగా రూ.3 లక్షల వరకు చెల్లిస్తామని దవాఖాన యాజమాన్యం చెప్పడంతో ఆందోళన విరమించారు. మహిళ పరిస్థితి విషమంగా ఉందని ముందే చెప్పామని దవాఖాన యాజమాన్యం వెల్లడించింది.