MP DK Aruna | జోగులాంబ గద్వాల జిల్లా, జనవరి 27 : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ కండువా కప్పుకోవాలని మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. గద్వాల పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై మండిపడ్డారు.
గద్వాల పట్టణంలో ఎవరికి ఓటు అడిగే హక్కు లేదని, ఎవరు ఏమి అభివృద్ధి చేశారో పట్టణ ప్రజలకు తెలుసని అన్నారు. తెలంగాణ స్పీకర్ ఇచ్చిన తీర్పు ప్రకారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీ కండువా కప్పుకుని ఎన్నికల్లో తిరగాలని ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు.
స్పీకర్ నిర్ణయాన్ని ఎమ్మెల్యే బండ్ల గౌరవించాలన్నారు. బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యే బండ్ల ఇప్పుడున్నది కాంగ్రెస్ పార్టీలోనని గద్వాల ప్రజలందరికీ తెలుసు. తాను కాంగ్రెస్లో ఉన్నా అని చెబితే.. కాంగ్రెస్ కండువా వేసుకొని తిరిగితే ఎమ్మెల్యే పదవి ఊడిపోతదని ఎమ్మెల్యే బండ్ల ఏదో అబద్దాలు చెప్పుకుంటూ తిరుగుతున్నరన్నారు. ఆయన ఏ మొహం పెట్టుకుని మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేస్తారన్నారని ప్రశ్నించారు.
ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ పాట పాడటం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికే సొంతమని డీకే అరుణ అన్నారు. గద్వాల పట్టణ అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానని, పట్టణ ప్రజలు గద్వాల అభివృద్ధి కావాలంటే బీజేపీకి పట్టం కట్టాలని డీకే అరుణ కోరారు.