సిరిసిల్ల టౌన్ జనవరి 27: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల కాలంలో సరైన నిధులు కేటాయించక సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధిలో కుంటుపడి దయనీయ స్థితిలో ఉన్నదని నాప్ స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని 17 వ వార్డులో స్థానిక బీఆర్ఎస్ నాయకులు గుండ్లపల్లి నీరజ – పూర్ణ చందర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మున్సిపల్ ఎన్నికల కార్యాలయాన్ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి తుల ఉమతో కలిసి ఆయన ప్రారంభించారు.
అనంతరం వారు మాట్లాడుతూ కేటీఆర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన సిరిసిల్ల మున్సిపాలిటీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధిలో దేశంలోనే ముందు వరసలో నిలిచిందన్నారు. కేటీఆర్ తీసుకున్న ప్రత్యేక చొరవతో సిరిసిల్ల మున్సిపాలిటీ జాతీయ స్థాయి అవార్డులను సొంతం చేస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు కేసీఆర్ ప్రజలకు అందించాలని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆరోపించారు.
సిరిసిల్ల మున్సిపల్ అభివృద్ధి కోసం కేటీఆర్ చొరవతో రూ.5 వేల కోట్లు విధులు కేటాయించాలని గుర్తు చేశారు. విద్య, ఉపాధి రంగాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని అన్నారు. ఉద్యమాలు చేసిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉన్నదని, ఇక్కడి ప్రజలు చైతన్య వంతులని పేర్కొన్నారు. అక్రమ, కేసులు నోటీసుల పేరుతో ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తున్నదని ఆరోపించారు. హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలు గమనించాలన్నారు.
మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, టిపిటిడిసి మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు గుండ్లపల్లి నీరజ, గుండ్లపల్లి పూర్ణచందర్, తదితర నాయకులు ఉన్నారు.