తెలుగు సినీరంగంలో ప్రతిభావంతులకు పట్టంకడుతూ, ఔత్సాహికుల్ని ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది గద్దర్ అవార్డులకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రజాకవి, వాగ్గేయకారుడు గద్దర్ పేరిట నెలకొల్పిన ఈ పురస్కారాలు విజయవంతంగా ద్వితీయ వసంతంలోకి అడుగుపెట్టాయి. 2025 సంవత్సరానికిగాను గద్దర్ ఫిల్మ్ అవార్డుల విజేతలను శనివారం ప్రకటించారు. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు కేంద్ర సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ పొందిన చిత్రాలకు ఈ పురస్కారాలను ప్రకటించారు. ఈ ఏడాది ఉత్తమ చిత్రం విషాదాంత ప్రేమకథ ‘రాజు వెడ్స్ రాంబాయి’ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. ఇదే సినిమాకుగాను సాయిలు కంపాటి ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. ఎన్టీఆర్ జాతీయ పురస్కారానికి అగ్ర నటుడు చిరంజీవి ఎంపికయ్యారు. ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ను పైడి జయరాజ్ అవార్డుతో సత్కరించనున్నారు. ఈ ఏడాది చిన్న చిత్రాలకు పెద్దపీట వేస్తూ అవార్డుల్ని ఎంపిక చేశారు. ఉగాది పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 19న గద్దర్ సినీ పురస్కారాలను ప్రదానం చేయబోతున్నారు.
చిన్న చిత్రంగా విడుదలైన ‘రాజు వెడ్స్ రాంబాయి’ కంటెంట్ పరంగా స్ట్రాంగ్ ఇంపాక్ట్‌ను క్రియేట్ చేసింది. పరువు హత్యలోని ఓ భయంకరమైన, దుర్మార్గమైన కోణాన్ని చూపిస్తూ ప్రేక్షకుల హృదయాల్ని మెలిపెట్టింది. యథార్థ సంఘటన ఆధారంగా దర్శకుడు సాయిలు కంపాటి రాసుకున్న ఈ కథ హృదయాల్ని కదిలించిన ప్రేమకథగా నిలిచింది. తెలంగాణ గ్రామీణ, వాస్తవిక జీవితానికి అద్దంపడుతూ రూటెడ్ సినిమాగా ప్రశంసలందుకుంది. రెండు కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 15కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. నాయకానాయికలు అఖిల్‌రాజ్, తేజస్వి రావుతో పాటు ప్రతినాయకుడి పాత్రను పోషించిన చైతు జొన్నలగడ్డ ఈ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
‘దండోరా’ సామాజిక సందేశం
పల్లెటూళ్లలో వేళ్లూనుకుపోయిన కులవిక్షణగా చర్చిస్తూ తెలంగాణ నేపథ్యంలో రూపొందించిన ‘దండోరా’ చిత్రం ఉత్తమ ద్వితీయ చిత్రంగా నిలిచింది. కొత్త దర్శకుడు మురళీకాంత్ కుల వివక్షను ఈ సినిమాలో కొత్త కోణంలో ఆవిష్కరించారు. ‘మన చావు బతుకులు ఊరికి దూరంగానే..’ అనే పాయింట్ చుట్టూ కుల వివక్ష, చావు నేపథ్యంలో అల్లుకున్న ఈ కథ బలమైన సామాజిక సందేశంతో ఆకట్టుకుంది.
లోకనాయకుడికి పైడి జైరాజ్ పురస్కారం
తెలంగాణ నుంచి సినీరంగంలో అగ్రపథాన వెలిగిన నటుల్లో పైడి జైరాజ్ అగ్రగణ్యుడు.. గద్దర్ అవార్డులలో భాగంగా ఆ మహానటుడు పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ పురస్కారానికి 2025 సంవత్సరానికి గాను అగ్ర నటుడు కమల్‌హాసన్‌ని ఎంపిక చేశారు. ఆయన తమిళ కథానాయకుడే అయినా.. తెలుగులోనూ మరపురాని చిత్రాల్లో నటించారు. మరోచరిత్ర, ఇది కథ కాదు, ఆకలిరాజ్యం, సాగరసంగమం, స్వాతిముత్యం, ఒక రాధా ఇద్దరు కృష్ణులు, శుభసంకల్పం.. ఇవి ఆయన నేరుగా తెలుగులో సాధించిన విజయాలు. నటుడిగా ఆయన చేయని ప్రయోగం లేదు. అందుకోని అవార్డులు లేవు. నిర్మాతగా, దర్శకునిగా కూడా ఎన్నో గొప్ప చిత్రాలను రూపొందించిన ఘనత కమల్‌హాసన్‌ది.
పైడి జైరాజ్ తర్వాత తెలంగాణ సినిమా ఖ్యాతిని పెంచిన మహానటుడు కె.ఎల్.కాంతారావు. ఆయన పేరిట ఏర్పాటు చేసిన అవార్డుకు పీపుల్‌స్టార్ ఆర్.నారాయణమూర్తిని రాష్ట్రప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రజాసమస్యలపై కళాత్మక పోరాటం చేస్తూ, ప్రజాకళాకారుడిగా గుర్తింపుతెచ్చుకున్నారు ఆర్.నారాయణమూర్తి. అర్థరాత్రి స్వతంత్య్రం, చీమలదండు, అడవి దివిటీలు, ఎర్రసైన్యం, ఒరేయ్ రిక్షా, దండోరా వంటి గుర్తుండిపోయే సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఎంత ఎదిగినా అంతకంతకూ ఒదిగుండే వ్యక్తిత్వం ఆర్.నారాయణమూర్తి. ఇవిగాక.. ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని ప్రసాద్ సంస్థల అధినేత ఎ.రమేష్‌ప్రసాద్‌కు, బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డుకు సింగీతం శ్రీనివాసరావును, నాగిరెడ్డి-చక్రపాణి పేరిట ఏర్పాటు చేసిన పురస్కారాన్ని అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్‌కీ, మహాకవి సి.నారాయణరెడ్డి పేరిట ఏర్పాటు చేసిన అవార్డుకు సుద్దాల అశోక్‌తేజను ఎంపిక చేశారు.
నా హృదయానికి దగ్గరైన పాత్ర
‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రానికిగాను ఉత్తమ కథానాయికగా అవార్డు గెలుచుకోవడం పట్ల అగ్ర కథానాయిక రష్మిక మందన్న ఆనందం వ్యక్తం చేసింది. ఈ సినిమాలో ఆమె భూమా దేవి పాత్రలో అద్భుతాభినయంతో మెప్పించింది. స్త్రీ స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం తపించే ఆధునిక మహిళగా ఆమె నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కాయి. గద్దర్ అవార్డుకు ఎంపిక కావడం పట్ల రష్మిక మందన్న తన ఎక్స్ ఖాతా ద్వారా ఆనందాన్ని వ్యక్తం చేసింది. ‘భూమా దేవి నా హృదయానికి దగ్గరైన పాత్ర. ఈ అవార్డును పొందడం గర్వంగా భావిస్తున్నా. ఇది నాకు ఎంతో ప్రత్యేకం. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు’ అని రష్మిక ఆనందం వ్యక్తం చేసింది.
ఈపాలి గురి తప్పేదేలే..
నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో రూపొందించిన ‘తండేల్’ సినిమా అక్కినేని నాగచైతన్య కెరీర్లోనే బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించింది. చైతూ కెరీర్లో తొలిసారి వందకోట్ల వసూళ్ల మైలురాయిని చిత్రమిది. దేశభక్తి కలబోసిన ఈ ప్రేమకథలో మత్స్యకారుడు రాజు పాత్రలో నాగచైతన్య చక్కటి అభినయంతో ఆకట్టుకున్నారు. మత్స్యకారుడి పాత్ర కోసం చైతూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఉత్తరాంధ్ర యాసలో శిక్షణ తీసుకోవడంతో పాటు షూటింగ్‌కు ముందు అక్కడి తీర ప్రాంత ప్రజలతో మమేకమై వారి జీవితం తాలూకు వాస్తవికతను అర్థం చేసుకున్నారు. ప్రేమ, విరహం, దేశకోసం పోరాటం..ఇలా భిన్న సంఘర్షణలతో కూడిన భావోద్వేగాల్లో నాగచైతన్య పరిపూర్ణంగా రాణించాడు. ‘ఈపాలి గురి తప్పేదేలేస్..’ అనే సినిమాలోని డైలాగ్ మాదిరిగా ఈ సినిమాతో నాగచైతన్య ఉత్తమ నటుడిగా అవార్డును సొంతం చేసుకున్నారు.
2025 గద్దర్ అవార్డ్స్ విజేతలు