అచ్చంపేటరూరల్ : అటవీ వన్యప్రాణి సాంబార్ జింకను చంపి, తిన్న కేసుల్లో 17 మందికి న్యాయ స్థానం రిమాండ్( Remand ) విధించింది. మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పద్మారం తండా గ్రామ పంచాయతీ పరిధిలోని పీర్ల దేవుని చెలక అటవీ ప్రాంతంలో పద్మారం, గోనబోయిన పల్లి గ్రామానికి చెందిన వ్యక్తులు వన్య ప్రాణి సాంబార్ జింకను చంపారు. అనంతరం జింక మాంసాన్ని వండుకుని తిన్నారు.
ఈ విషయం తెలుసుకున్న అధికారులు విచారణ జరిపి అధారాలు సేకరించిందని జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర తెలిపారు. ఆధారాల ప్రకారం17 మంది నిందితులను గుర్తించి అరెస్టు చేసి, బుధవారం న్యాయస్థానంలో హాజరుపరచినట్లు వివరించారు. వారికి న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపుతూ కల్వకుర్తి సబ్‌జైలుకు తరలించాలని ఆదేశించిందని వెల్లడించారు.
నిందితులను పట్టుకోవడంలో అచ్చంపేట ఫారెస్ట్ రేంజ్ అధికారులు ఎఫ్‌డీవో చంద్ర శేఖర్, ఎం.ఏ. సుబూర్, ఈశ్వర్, మగ్దూం హుస్సేన్ పాల్గొన్నారు. డీఎఫ్‌వో రేవంత్ చంద్ర మాట్లాడుతూ వన్యప్రాణులు ప్రకృతి సమతుల్యతకు మూలస్తంభాలని, వాటి సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు.
వన్యప్రాణులను వేటాడడం, చంపడం, గాయపరచడం, ఉచ్చులు ఏర్పాటు చేయడం, విషప్రయోగం చేయడం, మాంసం లేదా ఇతర అవయవాలను స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలన్నీ వన్యప్రాణి (సంరక్షణ) చట్టం, 1972 ప్రకారం తీవ్రమైన శిక్షార్హమైన నేరాలని స్పష్టం చేశారు. ప్రజల సహకారంతో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో అక్రమ వేటను పూర్తిగా అరికట్టి, వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ నిరంతరం కట్టుబడి పనిచేస్తుందని అయన తెలిపారు.