– బీఆర్ఎస్ ఖమ్మం నేతలు
– మంత్రులు తుమ్మల, పొంగులేటి అభివృద్ధి విధ్వంసం
ఖమ్మం, జూలై 29 : ఖమ్మం నగరంలోని ప్రకాశ్‌నగర్ వద్ద మున్నేరు వాగుపై నిర్మించిన చెక్‌డ్యామ్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడం ప్రజా ప్రయోజనాలను విస్మరించిన విధ్వంసకర పాలనకు నిదర్శనమని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. బుధవారం చెక్‌డ్యామ్ కూల్చివేసిన ప్రాంతాన్ని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సందర్శించి పరిస్థితిని పరిశీలించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చెక్‌డ్యామ్ కూల్చివేత కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, అనాలోచిత నిర్ణయాలు, ముందుచూపు లేని పాలనకు ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. కేసీఆర్ పాలనలో చేపట్టిన అభివృద్ధి పనుల ఆనవాళ్లను చెరిపి వేయాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని, ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ మంత్రులు తుమ్మల, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అదే విధానాన్ని అమలు చేస్తూ అభివృద్ధి విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపించారు. ముఖ్యంగా ఖమ్మం నియోజకవర్గంలో ప్రజలకు ఉపయోగపడే శాశ్వత ఆస్తులను ధ్వంసం చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా మారిందని విమర్శించారు.
ఖమ్మం నగరానికి దీర్ఘకాలిక తాగునీటి భద్రత కల్పించాలనే లక్ష్యంతో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చొరవతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రకాశ్‌నగర్ వద్ద మున్నేరు వాగుపై సుమారు రూ.8 కోట్ల వ్యయంతో చెక్‌డ్యామ్ నిర్మించారని గుర్తు చేశారు. ఈ చెక్‌డ్యామ్ నిర్మాణం వల్ల మున్నేరు పరివాహక ప్రాంతంలో భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగి, నగర వ్యాప్తంగా నీటి లభ్యత మెరుగుపడటంతో తాగునీటి సమస్యకు గణనీయమైన ఉపశమనం లభించిందని పేర్కొన్నారు. ప్రజల ప్రయోజనాలను పూర్తిగా పక్కనపెట్టి, ఎలాంటి ప్రత్యామ్నాయ కార్యాచరణ లేకుండానే రాజకీయ కక్షసాధింపు ధోరణితో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చెక్‌డ్యామ్‌ను పూర్తిస్థాయిలో కూల్చివేసిందని ఆరోపించారు. దీని ఫలితంగా భవిష్యత్తులో ఖమ్మం నగరం నీటి నిల్వలను కోల్పోయి తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కొనే ప్రమాదం ఉందని, దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
అలాగే, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చొరవతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు రూ.525 కోట్ల వ్యయంతో మున్నేరుకు ఇరువైపులా 17 కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. దానవాయిగూడెం నాగార్జునసాగర్ కాలువ ప్రాంతం నుంచి ప్రకాశ్‌నగర్ బ్రిడ్జి వరకు సుమారు 60 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని, ఈ నిర్మాణం పూర్తయితే భవిష్యత్తులో వరదల నుంచి నగరానికి మెరుగైన రక్షణ లభిస్తుందని వివరించారు. అయినప్పటికీ, చెక్‌డ్యామ్ కారణంగానే వరదలు వస్తున్నాయంటూ తప్పుడు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ప్రభుత్వం దానిని కూల్చివేసిందని విమర్శించారు. ప్రజలకు మేలు చేసే చెక్‌డ్యామ్‌ను తొలగించడం ద్వారా నగరంపై నీటి కొరతను కాంగ్రెస్ ప్రభుత్వమే ఆహ్వానించిందని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో సుమారు రూ.90 కోట్లతో ఐదు చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి భూగర్భ జలాలను పెంపొందించే దిశగా చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు.
గతంలో ప్రకాశ్‌నగర్ చెక్‌డ్యామ్ నిర్మాణానికి ముందు సంబంధిత అధికారులు, ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లు సమగ్ర సర్వే నిర్వహించి, సాంకేతిక నివేదికలు (డీపీఆర్‌లు) సిద్ధం చేశారని ఆ నివేదికల ఆధారంగానే గత ప్రభుత్వం చెక్‌డ్యామ్ నిర్మించిందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అధికార యంత్రాంగంతో విరుద్ధమైన నివేదికలు తయారు చేయించి కూల్చివేతకు మార్గం సుగమం చేసిందని ఆరోపించారు. సుమారు 200 మీటర్ల పొడవు, 3 మీటర్ల ఎత్తుతో నిర్మించిన ఈ చెక్‌డ్యామ్‌ను 2023 వరదలను సాకుగా చూపుతూ ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు ప్రజలకు వెల్లడించకుండా హడావుడిగా కూల్చివేసిందని విమర్శించారు. ప్రజలకు ఉపయోగపడే శాశ్వత ఆస్తులను సంరక్షించి మరింత బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రజోపయోగ నిర్మాణాలను ధ్వంసం చేయడానికే పరిమితమైందన్నారు. కొత్త అభివృద్ధి పనులు చేపట్టలేక, గత ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను కూల్చివేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనగా మారిందని విమర్శించారు.
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో భవిష్యత్తులో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి నిల్వలను పెంచడం, చెరువులు, వాగులు, చెక్‌డ్యామ్‌లను సంరక్షించడం, భూగర్భ జలాలను పరిరక్షించడం వంటి ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. దీని కారణంగా రానున్న రోజుల్లో ఖమ్మం నగరం తీవ్ర తాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు ధోరణిని విడనాడి ఖమ్మం నగర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర తాగునీటి కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే మున్నేరు వాగులో నీటి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించే చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు.