వికారాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లా రైతాంగంపై మరో భూ సేకరణ పిడుగు పడబోతున్నది. పరిగి మండలంలోని సయ్యద్‌పల్లి, అల్లాపూర్‌లో పెద్ద మొత్తంలో భూసేకరణకు రంగం సిద్ధమైంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి గాను సుమారు 1250 ఎకరాలను సేకరించనున్నారు. ఇందులో భాగం గా సయ్యద్‌పల్లి గ్రామంలోని ఇండ్లు మినహా మిగతా భూములన్నీ (సబ్‌మెర్జ్) మునిగిపోనున్నాయి. సయ్యద్‌పల్లిలో 854 ఎకరాలు రిజర్వాయర్ నిర్మాణానికి, మరో 83 ఎకరాలు టన్నెల్ నిర్మాణానికి సేకరించనున్నారు. అదేవిధంగా అల్లాపూర్‌లో 258 ఎకరాలు రిజర్వాయర్ నిర్మాణానికి, మరో 47 ఎకరాలు టన్నెల్ నిర్మాణానికి తీసుకోనున్నారు. ప్రస్తుతం ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహిస్తున్నారు. టన్నెల్ నిర్మాణానికి రెండు గ్రామాల్లో, రిజర్వాయర్ నిర్మాణానికి అల్లాపూర్‌లో ఎంజాయ్మెంట్ సర్వే పూర్తయ్యింది. రిజర్వాయర్ నిర్మాణానికి సయ్యద్‌పల్లిలో సర్వే నిర్వహించాల్సి ఉన్నది. ఈ సర్వే పూర్తయిన వెంటనే భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చేందుకు జిల్లా రెవెన్యూ యంత్రాంగం సన్నద్ధం అవుతున్నది. మరోవైపు ఎన్నో ఏండ్లుగా భూములను సాగు చేసుకుంటున్న రైతులు మా బతుకులను రోడ్డున పడేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే పరిగి మండలంలోని కాళ్లాపూర్ రైతులు భూములు తీసుకోవద్దంటూ ఉద్యమం చేస్తున్నారు. ఇండస్ట్రియల్ పార్కుకు వ్యతిరేకంగా రైతులు కదం తొక్కుతున్నారు. మూడు రోజుల క్రితం అసెంబ్లీలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఇండస్ట్రియల్ పార్కు కోసం భూ సేకరణ పూర్తి చేస్తామని అనడంతో మరోసారి రైతులు ఆందోళన బాట పట్టారు. రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు, ఆ తర్వాత వదిలిపెట్టారు. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంపై రైతులు మండిపడుతున్నారు. ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూములను ఇవ్వమంటే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములను లాక్కుంటే బతుకులు ఆగం ఆవుతాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు జారీ చేసిన భూసేకరణ ప్రక్రియను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పరిగి మండలంలోని కాళ్లాపూర్, రాపోల్ గ్రామాల పరిధిలోని 1197 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపైనే ఇప్పుడు రైతులు ఆందోళనలు చేపడుతున్నారు. తాజాగా సయ్యద్‌పల్లి, అల్లాపూర్‌లో కూడా భూసేకరణకు ప్రభుత్వం పూనుకోవడం ఆ రెండు గ్రామాల రైతుల్లో ఆందోళనకు కారణమైంది.
యాచారం, సెప్టెంబర్ 15: రైతులకు, ప్రజలకు ఫ్యూచర్లేకుండా చేస్తున్న ఫ్యూచర్‌సిటీ తమకు వద్దని ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ సమన్వయకర్త కవుల సరస్వతి అన్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని ఫార్మా బాధిత గ్రామమైన మేడిపల్లిలో మంగళవారం ఆమె ఫ్యూచర్‌సిటీకి వ్యతిరేకంగా ముమ్మర ప్రచారం చేశారు. ఫ్యూచర్‌సిటీ పేరుతో మేడిపల్లిలో ఏర్పాటు చేసే ఫార్మా కంపెనీలతో ప్రజలకు జరిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ఫ్యూచర్‌సిటీకి వ్యతిరేకంగా గ్రామస్తులు పోరాటాన్ని ముమ్మరం చేయాలని, ప్రజలకు హాని చేసే ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

ఫార్మాసిటీని రద్దు చేస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే రైతులను మోసం చేయడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికే ఫార్మాకోసం సేకరించిన భూములను టీజీఐఐసీ పూర్తిగా ఆధీనంలోకి తీసుకోవడంతో రైతులు పంటలు వేయకపోవడంతో వ్యవసాయం కనుమరుగైందని, వ్యవసాయ కూలీలకు ఉపాధి లేకపోవడంతో వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ నాయకులను నమ్మి ఓట్లేస్తే వారు రైతులను నట్టేట ముంచారని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఫార్మాసిటీ కోసం 19,333 ఎకరాలు సేకరిస్తే, అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేస్తామని, రైతుల భూములను తిరిగి ఇస్తామని చెప్పిన కాంగ్రెస్.. మండలంలో 30 వేల ఎకరాల భూమికి ఎసరు పెట్టిందని విమర్శించారు. మండలంలో మొండిగౌరెల్లి, కొత్తపల్లి, మేడిపల్లి గ్రామాల్లో వేల ఎకరాల్లో భూములను సేకరిస్తున్నట్టు పేర్కొన్నారు.