వినాయక్‌నగర్, సెప్టెంబర్ 15 : నిజామాబాద్ జిల్లాకు చెందిన మావోయిస్టు నాయకురాలు జనజీవన స్రవంతిలోకి వచ్చారు. 34 ఏండ్ల పాటు మావోయిస్టు ఉద్యమంలో చురుకుగా పాల్గొని, ఛత్తీస్‌గఢ్‌లోని మూడ్ డివిజన్ కమిటీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, డీసీఎం హోదాల్లో పని చేసిన నక్క సుశీలారాణి అలియాస్ లతాలలిత, జ్యోతి, మాధవి, శ్వేత మంగళవారం నిజామాబాద్ సీపీ సాయిచైతన్య ఎదుట లొంగిపోయారు. కమిషనరేట్‌లోని కమాండ్ కంట్రోల్ హాల్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో వివరాలను సీపీ వెల్లడించారు. బోధన్ పట్టణంలోని శంకర్‌నగర్‌కు చెందిన నక్కల సుశీల 1992లో డిగ్రీ చేస్తున్న సమయంలో మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితురాలై అజ్ఞాతంలోకి వెళ్లారు. హైదరాబాద్‌లో మావోయిస్టు సిటీ కమిటీ ఆర్గనైజర్‌గా పని చేసిన సుశీల వివిధ జిల్లాల కమిటీలో పనిచేస్తూ ముందుకు సాగారు.
1996-2002 వరకు పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు పని చేస్తున్న ఆమెను ఆంధ్ర-ఒడిశా సరిహద్దు కమిటీ దండకారణ్య ప్రాంతానికి బదిలీ చేశారు. 2011లో బేసిక్ కమ్యూనిస్టు ట్రైనింగ్ స్కూల్ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించారు. 2012-2014 వరకు పీఎల్జీఏ -2లో రాజకీయ శిక్షణ ఇవ్వడంలో బాధ్యతలు స్వీకరించారు. 2014-25 వరకు ఛత్తీస్‌గఢ్‌లోని మూడ్ ప్రాంతంలో డీవీసీలో బాధ్యతలు నిర్వహించి పలువురికి శిక్షణ ఇచ్చారు. లొంగిపోయిన సుశీలారాణికి రూ.5లక్షల రివార్డు చెక్కు ఇచ్చినట్టు సీపీ పేర్కొన్నారు. 2024-2026 వరకు 824మంది మావోయిస్టులు లొంగిపోగా వారి నుంచి 334 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని సీసీ తెలిపారు. మావోయిస్టు పార్టీలో ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో ముగ్గురు మాత్రమే ఉన్నట్టు వెల్లడించారు. ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, జాడే రత్నాబాయి అలియాస్ సుజాత, వర్ష శేఖర్ అలియాస్ మంగి అజ్ఞాతంలో ఉన్నారని పేర్కొన్నారు. సమావేశంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సీఐ వెంకట్‌నారాయణ ఉన్నారు.