హైదరాబాద్, సెప్టెంబర్ 15(నమస్తే తెలంగాణ) : 22ఏ నిషేధిత భూముల వివాదం నుంచి ఎలా బయటపడాలనే దానిపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతున్నది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీలో బుధవారం ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై మంగళవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో మంత్రులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రులతో సీఎం రేవంత్రెడ్డి పలు అంశాలు ప్రస్తావించినట్టు తెలిసింది. ధరణిపై దాడికి అందరూ సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్టు తెలిసింది. 22ఏ నిషేధిత భూముల వివాదాన్ని మొత్తంగా ధరణిపై నెట్టేద్దామని ముక్తకంఠంతో నిర్ణయించినట్టు సమాచారం. భూభారతిలో జరిగిన తప్పులను ప్రస్తావించకుండా మళ్లీ ధరణినే ముందర పెట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం.
భూభారతి ఫెయిలైందని, భారీగా భూ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆయన వ్యాఖ్యానించినట్టు తెలిసింది. అయితే, భూభారతి ఫెయిలైందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తే పార్టీకి, ప్రభుత్వానికి తీవ్ర నష్టం తప్పదనే ఆందోళన వ్యక్తంచేసినట్టు తెలిసింది. ధరణిపై విమర్శలు చేసిన మనం… ఇప్పుడు భూభారతితో అంత కన్నా ఎక్కువ తప్పులు చేస్తున్నామని చెప్పినట్టు తెలిసింది. ఈ వివాదానికి ధరణినే కారణమనే ప్రచారం చేయాలని ఆదేశించినట్టు సమాచారం. ధరిణినే బద్నాం చేయాలని ఆదేశించినట్టు తెలిసింది. ధరణికి సంబంధించి ఇప్పటికే పలు విచారణ కమిటీలు వేసిన నేపథ్యంలో భవిష్యత్తు చర్యలపైనా ఆదేశాలు ఇస్తానని చెప్పినట్టు తెలిసింది. యూఎల్సీ, అసైన్డ్, జీవో-59కు సంబంధించి విధానపరమైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నదని కూడా సీఎం చెప్పినట్టు తెలిసింది.