హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో 2028లో జరిగే అసెంబ్లీలో ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించనున్నదా? తెలంగాణ సాధకుడు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించబోతున్నారా? రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు గాను కనీసం 65 సీట్లు, గరిష్ఠంగా 85 సీట్లు వరకు రానున్నాయా? హామీల అమలు విఫలమై, అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ చతికిలపడనున్నదా? 2023 ఎన్నికలతో పోలిస్తే బీజేపీ, ఏఐఎంఐఎం సీట్లు తగ్గుతాయా? అంటే ప్రజలు అవుననే అంటున్నారు. ఈ మేరకు వివిధ సంస్థలు, మీడియా ప్రతినిధుల నిర్వహిస్తున్న ఒపీనియన్ పోల్స్‌లో తమ అభిప్రాయాలను ప్రజలు కుండబద్ధలు కొట్టినట్టు తెలియజేస్తున్నారు. గతంలో కొన్ని సంస్థలు నిర్వహించిన సర్వేల్లోనూ తెలంగాణలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీయేనని స్పష్టంచేశాయి. తాజా యూపీకి చెందిన యూట్యూబర్, ప్రముఖ జర్నలిస్ట్ అర్పిత్ శుక్లా దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది? ఎవరు అధికారంలోకి వస్తారు? గతంలో పోల్చితే ఆయా పార్టీలకు సీట్లు తగ్గుతున్నాయా? పెరుగుతున్నాయా? వంటి అంశాలతో కూడిన సర్వే చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలోనూ నిర్వహించిన ఒపీనియన్ పోల్స్‌లో బీఆర్ఎస్కు బంపర్ మెజారిటీ సాధించబోతున్నట్టు పబ్లిక్ పల్స్ ద్వారా తేటతెల్లమైంది.
సర్వే అంచనాల్లో బీఆర్ఎస్కు ఉత్తర తెలంగాణలో గణనీయమైన ఆధిక్యం కనిపిస్తున్నది. రాజన్న సిరిసిల్ల, మెదక్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, నిజామాబాద్, నిర్మల్ వంటి జిల్లాల్లో కారు పార్టీకి మెజారిటీ స్థానాలు దకుతాయని అంచనా వేశారు. ఉత్తర తెలంగాణలో గులాబీ పార్టీ మరింత పట్టుబిగిస్తున్నదనే సంకేతాలను తాజా సర్వే గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ఖమ్మం, నల్లగొండ, భువనగిరి, పెద్దపల్లి తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు కాస్త ఊరట కలిగించే ఫలితాలు వస్తాయని అంచనా. 2023 ఎన్నికలతో పోల్చితే దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ ఆధిపత్యం తగ్గుతున్నదని ఈ ఒపీనియన్ పోల్స్‌ను బట్టి తెలుస్తున్నది. సర్వే ప్రకారం కాంగ్రెస్ 42 స్థానాలకే పరిమితం కావచ్చని, ప్రజా వ్యతిరేకత మరింత పెరిగితే సీట్లు ఇంకా తగ్గే అవకాశం కూడా ఉన్నట్టు అంచనా వేశారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో కారు పార్టీ తన పట్టు మరింత బిగిస్తున్నట్టు ఒపీనియన్ పోల్స్‌లో వెల్లడైంది. గులాబీ పార్టీ పాత స్థానాలతో కొత్త సీట్లు దక్కించుకొనే అవకాశం ఉన్నట్టు సర్వేలో తెలిసింది. అదే సమయంలో బీజేపీ, ఏఐఎంఐఎం పార్టీలు ప్రస్తుతం సాధించిన సీట్లను 2028 ఎన్నికల్లో కోల్పోతాయని సర్వే ఫలితాలు ప్రకటించాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 15 సీట్లకుగాను బీఆర్ఎస్ 6, కాంగ్రెస్ 3, ఎంఐఎం 6 స్థానాలు గెలుచుకొనే అవకాశం ఉన్నట్టు సర్వే అంచనాలు తెలిపాయి. ముఖ్యంగా ఎంఐఎం గత ఎన్నికల్లో సాధించిన ఏడు స్థానాల నుంచి ఆరుకు తగ్గవచ్చని ఈ అంచనా సూచిస్తున్నది. సొంత ప్రాంతంలోనే సింగిల్ డిజిట్‌కు పరిమవుతున్న ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ.. ఇతర రాష్ర్టాల్లోనూ పాగా వేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ మినహా ఇతర ప్రాంతాల్లో ఆ పార్టీ ప్రభావం పరిమితంగానే ఉంటుందని సర్వే గణాంకాలను బట్టి తెలుస్తున్నది.

రాష్ట్రంలో కమలం పార్టీ ప్రభావం మరింత తగ్గనున్నట్టు సర్వే గణాంకాలు స్పష్టంచేశాయి. ప్రస్తుతం అసెంబ్లీలో బీజేపీకి ఎనిమిది మంది సభ్యులు ఉండగా, వచ్చే ఎన్నికల్లో వారి సంఖ్య ఆరుకే పరిమితం అవుతుందని ఒపీయన్ పోల్స్‌లో తేలింది. కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, మలాజిగిరి వంటి ప్రాంతాల్లో మాత్రమే బీజేపీ ప్రభావం కనిపిస్తుందని జిల్లావారీ గణాంకాల్లో వెల్లడైంది. బీఆర్ఎస్ 65 స్థానాలతో మెజారిటీ సాధిస్తే, కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుందన్నదని సర్వే స్పష్టంచేసింది. బీఆర్ఎస్ వర్గాలు కూడా 2028లో పార్టీ పునరాగమనం ఖాయమని ఇప్పటికే చెప్తున్నాయి. కేటీఆర్ 2028లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని గతంలో ప్రకటించారు.
సర్వే విశ్లేషణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు, పాలనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి బీఆర్ఎస్కు అనుకూలంగా మారుతున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. జిల్లాలవారీగా వెల్లడించిన గణాంకాలను కలిపితే బీఆర్ఎస్ 65, కాంగ్రెస్ 42, బీజేపీ 6, ఎంఐఎం 6 స్థానాలు వస్తాయని తాజా సర్వే అంచనా వేసింది. ఇటీవల మరో ఒపీనియన్ పోల్‌లోనూ బీఆర్ఎస్ ముందంజలో ఉన్నట్టు 84 సీట్లు వస్తాయని అంచనా వేశారు. ములుగు, నారాయణపేట జిల్లాల్లో ఒక్కో నియోజకవర్గం మాత్రమే ఉండటంతో సర్వే నిర్వాహకులు వాటిని సమీప జిల్లాల్లో కలిపారు. రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలు ఉండగా, ఉత్తర తెలంగాణలో గులాబీ జోరు ఉండగా, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ హవా గతంతో పోల్చితే తగ్గింది. బీజేపీ ప్రభావం గత ఎన్నికలతో పోలిస్తే తగ్గింది. ఎంఐఎం ఇతర రాష్ర్టాల్లో సైతం పోటీకి కాలుదువ్వుతున్నా సొంత ప్రాంతం హైదరాబాద్‌లో రోజురోజుకూ ప్రభావం తగ్గిపోతున్నది.
