రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గద్దర్ సినిమా అవార్డులలో భాగంగా మహానటుడు పద్మశ్రీ ఎన్టీరామారావు పేరిట ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక జాతీయ పురాస్కారానికి 2015కు గాను అగ్ర కథానాయకుడు చిరంజీవి ఎంపికయ్యారు. కమర్షియల్ సినిమాకు కొత్త వెలుగుని తీసుకొచ్చిన కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారాయన. నేటికీ చెక్కు చెదరని మాస్ ఇమేజ్ చిరంజీవి సొంతం. సంక్రాంతి కానుకగా రీసెంట్గా విడుదలైన ‘మన శంకర వరప్రసాద్‌గారు’ చిత్రం దాదాపు 400కోట్ల వసూళ్లు సాధించడమే అందుకు నిదర్శనం. రాజకీయరంగప్రవేశం ముందు వరకూ ఎన్టీఆర్ టాలీవుడ్ నంబర్‌వన్ హీరోగా వెలిగితే.. ఆ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసి, దశాబ్దాల పాటు నంబర్‌వన్ అనిపించుకున్న ఘనత చిరంజీవిది. ‘ఎన్టీఆర్ పేరిట నెలకొల్పిన అవార్డును పొందడం నిజంగా గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఈ సందర్భంగా ఈ పురస్కారానికి నన్ను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు. సినిమా పట్ల కళాకారుల ప్రేమకు, కష్టానికి ప్రతిఫలం ఈ పురస్కారాలు. ఈ ప్రయాణంలో అభిమానులే నాకు స్ఫూర్తినిస్తున్నారు. గద్దర్ అవార్డుల విజేతలందరికీ నా అభినందనలు’ అంటూ చిరంజీవి తన ఎక్స్ ఖాతా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు.