రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల సాధనకు ఈనెల 7 తేదీ ఉదయం పది గంటలకు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహించడానికి ఆ సంఘం నిర్ణయించింది. ఈ మేరకు సంఘం కార్యవర్గం సోమవారం సమావేశమైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించాలని సంఘం రాష్ట్ర నేతలు సమావేశమై నిర్ణయించారు.
రాష్ట్రంలో సుదీర్ఘకాలం సేవలు అందించి, రిటైరైన ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య భద్రతను ఇచ్చే ఎంప్లాయీస్ హెల్త్‌స్కీమ్ (ఈహెచ్ఎస్) సంక్షోభంలో పడింది. గత నెల 15న ఉద్యోగులతోపాటు రిటైర్డ్ ఉద్యోగులకు కూడా డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తామన్న కాంగ్రెస్ సర్కార్ చివరకు నిరాశే మిగిల్చింది. ఇంతవరకు నెట్వర్క్ దవాఖానలతో ఒప్పందాలు చేసుకోలేదు. కొత్త ఎంప్లాయి హెల్త్‌కేర్ ట్రస్ట్ (ఈహెచ్సీటీ) సేవలను ప్రభుత్వం ప్రతిపాదించిన ప్యాకేజీ ధరలతో సేవలు అందించలేమని తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (టీఏఎన్హెచ్ఏ) తేల్చిచెప్పింది. అంతేకాకుండా ఈ కొత్త పథకం అమలుకు ముందే పాత ఈహెచ్ఎస్ పెండింగ్ బకాయిలు నెట్వర్క్ హాస్పిటల్స్‌కు చెల్లించాలని టీఏఎన్హెచ్ఏ డిమాండ్ చేసింది.
ఉమ్మడి రాష్ట్రంలో 2005 ఫిబ్రవరి 15న అప్పటి ప్రభుత్వం జీవో 74 విడుదల చేసింది. దీని ద్వారా ఉద్యోగి లేదా పెన్షనర్ తన చేతి నుంచి హాస్పిటల్‌కు చెల్లించిన లక్షల రూపాయలు రీయింబర్స్మెంట్ బిల్లుల ద్వారా సకాలంలో వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఒకవేళ రీయింబర్స్మెంట్ బిల్లు వచ్చినా అందులో సగం కట్ అయి రెండు లేదా మూడేండ్ల తర్వాత చేతికి అందేది. ఈ ఇబ్బందులన్నింటినీ దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. వృద్ధాప్యంలో అత్యంత కీలకమైనది ఆరోగ్యమని, పెన్షనర్లకే కాకుండా ఉద్యోగులందరికీ మేలు జరిగేలా కేసీఆర్ విశాల దృక్పథంతో 2023 అక్టోబర్ 8న కొత్త హెల్త్ స్కీమ్ జీవో 186ను జారీ చేశారు. ఈ పథకాన్ని వైద్య ఆరోగ్య శాఖ పకడ్బందీగా అమలుపరిస్తే రాష్ట్రంలోని లక్షలాది ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాల్లో వెలుగులు నింపవచ్చునని కేసీఆర్ ఎంతో ఆకాంక్షించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి నేటివరకు రెండేండ్ల తొమ్మిది నెలలు గడిచినప్పటికీ బీఆర్ఎస్ హయాం నాటి జీవో 186లో కొన్ని మార్పులు చేసింది. అయినా దానిని ఇంతవరకు పకడ్బందీగా అమలు చేసిన దాఖలాలు లేవు. కానీ ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి హెల్త్ కార్డుల కోసం
రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం కట్ చేస్తున్నది.
ఈ ఏడాది ఫిబ్రవరి 12న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన అధికారులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సమావేశం జరిగింది. నగదు రహిత వైద్యం విషయంలో వచ్చిన అభిప్రాయాలకు అనుగుణంగా ఉద్యోగుల మూలవేతనం నుంచి, రిటైర్డ్ ఉద్యోగుల బేసిక్ నుంచి నెలకు 1.5 శాతం రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన హెల్త్ట్రస్టుకు అందించడానికి ఆ సమావేశంలో అంగీకారం కుదిరింది. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల నుంచి వసూలు చేసిన మొత్తంతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటా చెల్లించడానికి ఒప్పందం జరిగింది. కానీ ఉద్యోగులు, పెన్షనర్లకు డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వకముందే, దవాఖానల యాజమాన్యాల అంగీకారం పొందకముందే ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి ఈ ఏడాది మే, జూన్ నుంచి 1.5 శాతం వంతున రాష్ట్ర ప్రభుత్వం మినహాయించుకున్నది. అయితే, ఆ మొత్తం ఎంప్లాయీస్ హెల్త్‌కేర్ ట్రస్ట్ (ఈహెచ్ఎస్సీటీ) ఖాతాల్లోకి బదిలీ అయినట్లు సమాచారం లేదు. ఇది ఎంతవరకు న్యాయం? సర్కార్ చెప్పిన తేదీ గత నెల 15 నాటికి హెల్త్ కార్డులు ఇవ్వకపోవడం పట్ల పలువురు ఉద్యోగులు, పెన్షనర్ల సంఘాల నేతలు, ఎంప్లాయీస్ హెల్త్‌కేర్ ట్రస్ట్ సభ్యులు సీఎస్‌ను కలిసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
సీజీహెచ్ఎస్ టారిఫ్‌లో కొత్త ఈహెచ్సీటీ సేవలు అందించలేమంటూ తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ప్రతిపాదిత ప్యాకేజీ ధరలో ప్రస్తుత ఆరోగ్యశ్రీ, గత ఈహెచ్ఎస్ ప్యాకేజీ ధరల కంటే తక్కువగా ఉన్నాయని తెలిపింది. ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ప్రైవేటు దవాఖానలకు ఆర్థికంగా తీవ్ర నష్టం తప్పదని వాపోయారు. ప్యాకేజీల్లో శాస్త్రీయత ఉంటేనే రేట్లు ఫిక్స్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన సూచించారు. రాష్ట్రంలో 2024 ఏప్రిల్ తర్వాత రిటైరైన ఉద్యోగుల్లో సుమారు 10 వేల మందికి పైగా బెనిఫిట్స్ రాక నానా అవస్థలు పడుతున్నారు. అంతేకాకుండా ఉద్యోగులు, పెన్షనర్లకు 2024 జనవరి నుంచి ఆరు డీఏ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇటు కొత్త పీఆర్సీ మంజూరు కాక, ఇటు డిజిటల్ హెల్త్‌కార్డులు రాక రాష్ట్రవ్యాప్తంగా 7.8 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఆవేదన చెందుతున్నారు. దీనికితోడు ఇప్పటికీ కొత్త హెల్త్ కార్డులు డౌన్లోడ్ కాకపోవడంతో సవాలక్ష సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను సత్వరం పరిష్కరించాల్సిన అవసరం ఎంతో ఉన్నది.రిటైర్డ్ ఉద్యోగులు ఈనెల7న మహాధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సమస్యను మరింత జఠిలం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నెట్వర్క్ హాస్పిటల్స్‌తో మరొకసారి సమావేశం ఏర్పాటు చేసి, వారి ఇబ్బందులను పరిష్కరించాలి.
(వ్యాసకర్త: ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకుడు)
-సీవీవీ ప్రసాద్
8019608475