Lok Adalat | కక్షిదారులు తమ కేసులను రాజీమార్గంలో త్వరితగతిన పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ దోహదపడుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సామ్ కోషి అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం గద్వాల కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో నిర్వహించిన ఈ ఏడాదికి సంబంధించిన మొదటి జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమంను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సామ్ కోషి, జస్టిస్ శ్రవణ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా జస్టిస్ సామ్ కోషి మాట్లాడుతూ.. మెగా లోక్ అదాలత్ ద్వారా జోగులాంబ గద్వాల జిల్లాలో 5345 కేసులు పరిష్కరించడం గర్వకారణమన్నారు. చిన్న చిన్న తగాదాలతో కోర్టుల వరకు వచ్చిన కక్షిదారులు తమ కేసులను త్వరితగతిన పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ గొప్ప వేదికగా పేర్కొన్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సావధానంగా పరిష్కరించుకునేందుకు ఇరుపక్షాలు ముందుకు వస్తే కోర్టుల్లో కేసులు వేయాల్సిన అవసరం రాదన్నారు. ఒకసారి కోర్టులో కేసు వేశారంటే పరిష్కారం కావడానికి కొన్ని నెలలు, సంవత్సరాలు అవుతుందని లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవడం రాజమార్గం అని పేర్కొన్నారు.
న్యాయవాదులు తమ కక్షిదారుల కేసులను త్వరగా పరిష్కరిస్తేనే ఎక్కువమంది ఆ లాయర్ల దగ్గరకు వస్తారని, ఏళ్ల తరబడి కేసులు పరిష్కారం కాకుంటే ప్రయోజనం లేదన్నారు. మనం ప్రస్తుతం 21వ శతాబ్దంలో ఉన్నామని, ఏ కక్షిదారుడు కూడా ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాలని కోరుకునే పరిస్థితి ప్రస్తుతం ఉండకూడదన్నారు. కక్షిదారులు న్యాయ సేవాధికార సంస్థను సంప్రదిస్తే తమ కేసుల పరిష్కారానికి సంబంధిత న్యాయవాదులు సరైన దిశానిర్దేశం చేస్తారన్నారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి నిర్వహించే లోక్ అదాలత్ ద్వారా పెద్ద ఎత్తున కేసులను పరిష్కరించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
జస్టిస్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. కక్షిదారులు చిన్న చిన్న తగాదాలతో కోర్టుల వరకు రావడంతో ఆయా న్యాయస్థానాల్లో పెద్ద ఎత్తున కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయని, ఇరుపక్షాలు రాజీమార్గంలో తమ కేసులను పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గతంలో తమ తమ ప్రాంతాల్లోని పెద్దమనుషుల సమక్షంలోనే చిన్న చిన్న తగాదాలను పరిష్కరించుకునేవారని, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం కానీ సమస్యలను కోర్టులో వేయడం జరిగేదన్నారు.
ప్రస్తుతం చాలా మంది చిన్నపాటి తగాదాలతోనే న్యాయస్థానాలను ఆశ్రయించడం వలన ఆయా కేసులను పరిష్కరించుకునేందుకు న్యాయ సేవాధికార సంస్థ కృషి చేస్తుందన్నారు. న్యాయవాదులు, లా విద్యార్థులు కూడా లీగల్ హెయిర్ సెంటర్స్, లోక్ అదాలత్‌ల ద్వారా కక్షిదారులు తమ కేసులను పరిష్కరించుకునేందుకు సహకరించాలన్నారు. ఒకసారి ఇరుపక్షాలు తమ కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకునేందుకు ముందుకు వస్తే తిరిగి అప్పీల్ కు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. లోక్ అదాలత్ ద్వారా ఇరుపక్షాల కక్షిదారులకు రాజీమార్గంలో సత్వరమే న్యాయం జరుగుతున్నందున న్యాయవాదులు పెద్ద ఎత్తున లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారానికి సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
ప్రశాంతంగా ఆలోచిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం..
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పంచాక్షరి మాట్లాడుతూ.. తెలిసో తెలియకో ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో తప్పులు చేస్తుంటారని, ప్రశాంతంగా ఆలోచిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి చిన్న పాటి తగాదాలకే ప్రజలు కోర్టుల దాకా రావలసిన అవసరం లేదన్నారు. కేసులు వేయడం వలన ఒక కోర్టులో తమకు న్యాయం జరగలేదని.. ఒక కక్షిదారుడుపై కోర్టుల దాకా వెళ్తుండడంతో సమయం, డబ్బులు వృధా అవుతాయన్నారు. ఇరుపక్షాలు రాజీమార్గంలో కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలని సూచించారు. లోక్ అదాలత్‌లు విజయవంతం కావడానికి అడ్వకేట్స్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, పోలీసు శాఖ వారి సహకారం కీలకమైనదిగా ఆయన పేర్కొన్నారు.
జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి రవికుమార్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా వివిధ కోర్టుల పరిధిలో మొత్తం 7846 కేసులు అపరిష్కృతంగా ఉన్నాయని, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా పెద్ద ఎత్తున కేసులను రాజీమార్గంలో పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం పలు కేసులకు సంబంధించి రాజీ అయిన పలువురు కక్షిదారులకు హైకోర్టు న్యాయమూర్తులు అవార్డు కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టు యంత్రాంగం, బార్ అసోసియేషన్, పలువురు న్యాయవాదులు హైకోర్టు న్యాయమూర్తులను, ఇతర అతిథులను శాలువా, పుష్ప గుచ్చాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.
అంతకుముందు జిల్లాకు వచ్చిన హైకోర్టు న్యాయమూర్తులను ఎర్రవల్లి మండల కేంద్రంలోని పదవ పోలీస్ బెటాలియన్ వద్ద ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, బెటాలియన్ కమాండెంట్ జయరాజు, పలువురు జిల్లా న్యాయమూర్తులు, తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి లక్ష్మి, పోక్సో కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పూజిత, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఉదయ్ కుమార్, గద్వాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు నరసింహులు, వివిధ జిల్లా న్యాయస్థానాల పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వినోదాచారి, శ్రీనివాస్ రెడ్డి, విజయ్ కుమార్, భవాని, రేచల్, ఇతర న్యాయవాదులు, పోలీస్ శాఖ అధికారులు, కక్షిదారులు, తదితరులు పాల్గొన్నారు.
‘పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేయించాలి’
Mamata Banerjee | బెంగాల్‌ను టార్గెట్ చేస్తే.. కేంద్రంలో బీజేపీని గద్దె దించుతా : మమతాబెనర్జీ
Suicide | వ్యవసాయ విశ్వవిద్యాలయం అటవి ప్రాంతంలో ఒకరు ఆత్మహత్య