Mamata Banerjee : పశ్చిమబెంగాల్ (West Bengal) సీఎం మమతా బెనర్జీ (CM Mamata Banerjee) కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJP) పై తీవ్ర విమర్శలు చేశారు. ముర్షిదాబాద్ (Murshidabad) లో శుక్రవారం రామనవమి శోభాయాత్ర జరుగుతున్న సమయంలో ఘర్షణలు చోటుచేసుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. పశ్చిమబెంగాల్‌ను ధ్వంసం చేయాలని చూస్తే బీజేపీ దేశంలో అధికారం కోల్పోవడం ఖాయమని అన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఢిల్లీని స్వాధీనం చేసుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ముందుకు వెళ్తానని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లోని రాణిగంజ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడారు.
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇళ్ల పైకి బుల్డోజర్లను ప్రయోగించి ప్రజలందరినీ బయటకు గెంటేస్తారని మమత ఓటర్లను హెచ్చరించారు. తమ గెలుపు కోసం దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటూ బీజేపీ నేతలు అన్ని హద్దులను దాటుతున్నారని మండిపడ్డారు. ఆ పార్టీ ఆదేశాల మేరకే ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఎలక్షన్స్‌కు ముందు హడావిడిగా ‘సర్’ ప్రక్రియ చేపట్టిందని ఆరోపించారు. ఓటరు జాబితా నుంచి బెంగాలీ ఓటర్లను తొలగించడానికి ఎన్నికల కమిషన్‌ను బీజేపీ పావులా వాడుకుంటోందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఉనికి లేకుండా చేయడం, ఆ పార్టీ నుంచి దేశాన్ని రక్షించడమే తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమన్నారు.
రాణిగంజ్‌లోని పర్వత ప్రాంతాల్లో తరచూ కొండచరియలు విరిగిపడుతుండడం వల్ల అక్కడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని మమత ఆవేదన వ్యక్తంచేశారు. ఇటువంటి ప్రమాదకర ప్రాంతాలను విడిచిపెట్టి.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లే వారికి తమ ప్రభుత్వం గృహవసతితోపాటు రూ.10 లక్షల ఆర్థికసాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. బెంగాల్లో గెలువగానే దేశంలోని ఇతర రాజకీయ పార్టీలతో కలిసి కేంద్రంలో బీజేపీని గద్దె దించుతానని హెచ్చరిక చేశారు.