వనపర్తి, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై 53 రోజులు కాగా.. వీటిలో ఇంచుమించు 45 రోజుల పని దినాలున్నాయి. ఈ రోజుల్లో పట్టుమని నాలుగు పాఠశాలలు కూడా డీఈవో పర్యవేక్షణ జరపలేదంటే ఆయన పనితీరుకు దర్పణం పడుతుంది. జిల్లాలో 365 ప్రాథమిక పాఠశాలలుంటే, మరో 60 ప్రాథమికోన్నత పాఠశాలలు, 102 జిల్లా పరిషత్ పాఠశాలు ఉన్నాయి. వీటిలో 2, 420 మంది ఉపాధ్యాయులు పని చేస్తుండగా, 32,895 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నా రు. ఇలా పర్యవేక్షణ లోపంతో విద్యార్థుల భవిష్యత్ అంతా ‘గోవింద’ అన్న చందంగా వనపర్తి విద్యావ్యవస్థ తయారైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వనపర్తి జిల్లాలో విద్యావ్యవస్థ నిద్రావస్థలో ఉన్నది. అధికారుల పర్యవేక్షణ లేక తూతూ మంత్రంగా బడుల నిర్వహణ నడుస్తున్నది. కనీస పర్యవేక్షణ లేకపోవడంతో ఉదాశిన వైఖరి ప్రభుత్వ పాఠశాలల్లో కనిపిస్తుంది. ఎప్పుడో ఒకసారి పాఠశాలకు వెళ్లినా.. కేవలం మధ్యాహ్న భోజనం దగ్గరకు వెళ్లడం ఫొటోలు దిగడం తప్పితే, ఇసుమంత కూడా ఉపయోగం ఉండడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ తనిఖీలో జరిగేదంతా ఫొటోల తంతు కోసమేనన్నట్లు ఇటు అధికారులు… అటు ఉపాధ్యాయులు.. విద్యార్థులు కూడా ఫిక్స్ అయిపోయారు. దీని వల్ల ఎలాంటి ప్రయోజనం ఒనగూరడం లేదు. దేశ భవిష్యత్ తరగతి గది నుంచే ప్రారంభమవుతుందని గ్రామ సర్పంచ్ మొదలుకొని ముఖ్యమంత్రులు,
ప్రధానమంత్రుల వరకు, గ్రామ కార్యదర్శులు నుంచి కలెక్టర్ వరకు సందర్భం వచ్చినప్పుడల్లా పదే.. పదే గుర్తు చేస్తారు. ఇవన్నీ మాటలకే పరిమితమవుతున్నాయి. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి సైతం ప్రమోషన్లు పొందిన ఉపాధ్యాయులతో హైదరాబాద్‌లో నిర్వహించిన మీటింగ్‌లో ఇదే విషయం చెప్పారు. విద్యావ్యవస్థపై బాధ్యతగా వ్యవహరించాలని, ఈ ఏడాది రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో ఏకంగా రెండు లక్షల అడ్మిషన్లు తగ్గిపోయాయని సీఎం సైతం ఆందోళన వ్యక్తం చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.
వనపర్తి జిల్లా విద్యాశాఖ అధికారిగా గోవిందరాజులు కొనసాగుతున్నారు. ఈయన రెగ్యులర్ పోస్టు మహబూబ్‌నగర్‌లోని బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు మొదటి ఇన్చార్జి డీఈవోగా నాగర్‌కర్నూల్ జిల్లాతోపాటు అదనంగా వనపర్తి జిల్లా బాధ్యతలు సైతం నిర్వహిస్తున్నారు. మూడు చోట్లా విధులను నిర్వహిస్తున్న డీఈ వో ఎక్కడ కూడా న్యాయం చేయడం లేదు.
ఈ క్ర మంలో సీఎం చెప్పినట్లు తరగతి గదిలో సిద్ధమయ్యే దేశ భవిష్యత్ మరింత అంధకారంలోకి వెళ్తున్నది. వారం రోజుల పనిదినాల్లో ఓ రెండు, మూడ్రోజులు వనపర్తికి కేటాయించినా అది అంతంత మాత్రంగానే ఉన్నది. దీంతో వనపర్తి జిల్లా విద్యావ్యవస్థ నిద్రావస్థకు చేరుకున్నది. ఒక జిల్లా అధికారి రాకపోకల వ్య వహారమే ‘ఆయా రాం.. గయా రాం’ అన్న చందం గా ఉంటే.. ఇక ఆ అధికారిపై ఆధారపడ్డ వ్యవస్థ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
వనపర్తి విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందనడానికి అధికారుల పర్యవేక్షణే తార్కాణంగా నిలుస్తున్నది. ఈ ఏడాది బడులు ప్రారంభమై 53 రోజులు గడిస్తే.. అందులో 45 రోజుల వరకు పని దినాలు ఉన్నాయి. వీటిలో కేవలం నాలుగు బడులను కూడా డీఈవో పరిశీలించలేదంటే, ఆయన పనితీరు ఎలా ఉందో తెలిసిపోతుందని పలువురు ఆరోపిస్తున్నారు. పాఠశాలల ప్రారంభంలో విద్యా వ్యవస్థను సరైన క్రమ పద్ధతిలో మానిటరింగ్ చేయడం వల్ల చివరి దాకా అదే వాతావరణం కొనసాగే పరిస్థితులుంటాయి. కేవలం వచ్చామా.. వెళ్లామా.. అన్నట్లు ఎప్పుడో ఒకసారి ఇలా బడులకు వెళ్లడం వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. పర్యవేక్షణకు వెళ్లినప్పుడు సైతం కేవలం ఫొటోల వరకే అన్నట్లు ఉండటం వల్ల ప్రయోజనం ఏముంటుందన్న ప్రశ్న లు ఉత్పన్నమవుతున్నాయి.
విద్యార్థుల సామర్థ్యం.. అప్పటి వరకు జరిగిన బోధన తీరు తదితర వాటిపై మొక్కుబడిగా వ్యవహరించడం వల్లే ప్రభుత్వ పాఠశాలల్లో అనుకున్న ప్రామాణికాలతో కూడిన విద్య విద్యార్థులకు అందడం లేదన్న విమర్శలు లేకపోలేదు. జిల్లాలోని కొత్తకోట మండల కేంద్రంతోపాటు పెద్దమందడి మండలం మద్దిగట్ల, గోపాల్పేట పాఠశాలలకు మాత్రమే ఇప్పటి వరకు జిల్లా విద్యాశాఖాధికారి వెళ్లినట్లు సమాచారం. ఇక వీపనగండ్లకు పాఠశాలలు ప్రారంభం కానప్పుడు వెళ్లడం, చిన్నంబాయికి మంత్రి జూపల్లి పర్యటన సందర్భంలో వెళ్లి వ చ్చారే తప్పా.. మరోటి లేదన్న గుసగుసలున్నాయి. ఇంకా పది మండలాల మొఖం ఇప్పటి వరకు చూడలేదన్న విద్యార్థుల తల్లిదండ్రులే అంటున్నారు.
మూడు చోట్ల కొలువైన డీఈవో పరిస్థితి ఇలా ఉంటే.. అందుకు ఎంఈవోలు కూడా తీసిపోరు అనే చందంగా ఒక్కొక్కరికీ రెండు మూడు మండలాల అదనపు బాధ్యతలు ఉన్నాయి. జిల్లా అధికారి సక్రమంగా అందుబాటులో లేనప్పుడు ఇక కిందిస్థాయి పర్యవేక్షణ ఎలా ఉంటుందన్నది ప్రత్యేకంగా చెప్పే దేం ఉండదు. జిల్లాలో 14 మండలాలకు కేవలం ఆరుగురు ఇన్చార్జి ఎంఈవో ఉన్నారు. వీరంతా హెచ్ఎం బాధ్యతలను నిర్వహిస్తూ అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్నారు.
జిల్లాలో ఒక్కగానొక్క రెగ్యులర్ ఎంఈవో లక్ష్మణ్‌నాయక్ ఉండగా ఆయన కూడా శంషాబాద్‌కు ఇటీవలే బదిలీపై వెళ్లారు. ఇక లక్ష్మణ్‌నాయక్ బాధ్యతలున్న మూడు మండలాలు పాన్‌గల్, వీపనగండ్ల, చిన్నంబాయిలకు కనీసం ఇన్చార్జీలను కూడా నియమించే పరిస్థితి లేకుండానే అతడిని రిలీవ్ చేశారు. ఇంకా మిగిలిన చోట్ల ఒక్కొక్క ఇన్చార్జికి రెండు, మూడు మండలాలను సైతం అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ ఇన్‌చార్జ్జి ఎంఈవోలు సహితం వారు పనిచేస్తున్న మండలంలోని బడులను మాత్రమే తనిఖీలు చేస్తున్నారు.
ఇక పక్క మండలాలకు వెళ్లి పర్యవేక్షణ జరిపిన దాఖలాలు నా మమాత్రంగానే ఉన్నాయి. ఈ పరిస్థితిలో సర్కారు బడుల్లో విద్యాప్రమాణాలు ఎలా ఉన్నాయో అర్థమవుతుంది. జిల్లాలో డీఈవో, ఎంఈవోల వ్యవస్థ పటిష్టంగా లేనప్పుడు ఇక పంతుళ్లు.. పాఠశాలలు పటిష్టంగా ఉంటాయని అనుకొనే అవకాశమే లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం వనపర్తి జిల్లాకు రెగ్యులర్ డీఈవోతోపాటు అన్ని మండలాలకు ఎంఈవోలను నియమించి మెరుగైన విద్యాబోధన జరిగేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే.. పాఠశాలల పర్యవేక్షణ తదితర అంశాలపై డీఈవోను సంప్రదించడం కోసం కార్యాలయానికి వెళితే.. నాగర్‌కర్నూల్‌కు వెళ్లారని అక్కడున్న సిబ్బంది తెలిపారు. అలాగే ఫోన్లో ప్రయత్నించినా ఆయన స్పందించలేదు.