హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాత పెన్షన్ పునరుద్ధరించాలని, ఎన్పీఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలిపారు. నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్‌పెన్షన్ సీమ్ జాతీయ అధ్యక్షుడు వీకే బంధు, సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ నాయకత్వంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేపడుతున్న నిరసన కార్యక్రమంలో తెలంగాణ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేశ్‌గౌడ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా పాతపెన్షన్ వ్యవస్థను పునరుద్ధరించాలని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్‌పెన్షన్ సీమ్ అనేక ఏండ్లుగా పోరాడుతుందని తెలిపారు. ఈ పోరాటం ఫలితంగానే నాలుగు రాష్ట్రాల్లో పాత పెన్షన్ వ్యవస్థను పునరుద్ధరించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పవన్ వెంకటేశ్, నరేంద్రరావు, శ్యాంసుందర్, చంద్రకాంత్, నిసర్ అహ్మద్, సతీశ్‌లు పాల్గొన్నారు.