సిటీబ్యూరో, మార్చి 5 (నమస్తే తెలంగాణ ) : ఆస్తిపన్ను బకాయిదారులపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపుతున్నది. అప్పు ల ఊబిలో కూరుకుపోయిన ట్రై కార్పొరేషన్లను గట్టెకించేందుకు బకాయిదారులను టార్గెట్ చేసింది. 60 సర్కిళ్ల పరిధిలో మొండి బకాయిదారులను గుర్తించి వారికి రెడ్ నోటీసుల అస్ర్తాన్ని ప్రయోగిస్తున్నారు. ఈ నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న దరిమిలా రూ.3వేల కోట్ల లక్ష్యంలో ఇప్పటికే రూ.2వేల కోట్ల మేర వసూళ్లను రాబట్టారు. వచ్చే 25 రోజుల్లో రూ.1000 కోట్ల టార్గెట్గా ఆస్తిపన్ను వసూళ్లపై స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు.
ఇందులో భాగంగానే ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బందిపై ఒత్తిడి పెంచారు. దీంతో వారు నేరుగా జనం ఇండ్లు, దుకాణాలకు నోటీసులు ఇవ్వడం, అవసరమైతే రెవెన్యూ రీకవరీ యాక్ట్ (ఆర్ఆర్ యాక్ట)ను ప్రయోగించేందుకు సిద్ధమవుతుండడం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో ఆస్తి పన్ను బకాయిదారులపై అధికారులు కొరడా ఝుళిపించనున్నారు. అనేక సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించని మొండి బకాయిదారుల ఆస్తులను సీజ్ చేయనున్నారు.
ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో లక్ష్యాలను చేరుకోవడమే ధ్యేయంగా జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా ఏర్పడిన సికింద్రాబాద్, మలాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పన్నులు చెల్లించకుండా ఏండ్ల తరబడి కాలయాపన చేస్తున్న సుమారు 3.50 లక్షల మంది యజమానులకు ఇప్పటికే అధికారులు రెడ్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటి వరకు సుమారు 11,500 ఆస్తులను గుర్తించిన యంత్రాంగం.. వారం రోజుల నుంచి తుది హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
గ్రేటర్ విభజన అనంతరం మున్సిపల్ వార్డుల సంఖ్యకు అనుగుణంగా టార్గెట్లను కూడా అధికారులు పంచుకున్నారు. ట్రై కార్పొరేషన్ల పరిధిలో 23 లక్షల ఆస్తులు ఉండగా, జీహెచ్ఎంసీ పరిధిలో 11 లక్షలు, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలో మిగిలిన 12 లక్షల ఆస్తులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, జీహెచ్ఎంసీలో 11 లక్షల ఆస్తులు ఉండగా, ఈ నెలాఖరుకల్లా రూ. 1,000 కోట్ల వసూళ్లే లక్ష్యంగా పెట్టుకున్నారు.
