KTR : ఇంజనీరింగ్ విద్యార్థులనుద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అభ్యంతరకర కామెంట్స్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) డిమాండ్ చేశారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, పార్టీ నేత రాహుల్‌కు కేటీఆర్ ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ఇంజనీరింగ్ విద్యార్థులను, ఇంజనీర్లను “క్రిమినల్ వేస్ట్” అన్న ముఖ్యమంత్రి కామెంట్స్‌పై రాహుల్ మౌనం వీడి క్షమాపణ చెప్పాలని, లేదంటే రేవంత్ వ్యాఖ్యలను సమర్ధించినట్టే అవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తేల్చి చెప్పారు.
ఇంజనీర్లు, భారతదేశ ఇంజనీర్లు ప్రపంచ కంపెనీలను నడుపుతుంటే, అంతరిక్షంలోకి రాకెట్లను పంపుతుంటే… అలాంటి వారిని “క్రిమినల్ వేస్ట్” అని రేవంత్ రెడ్డి అంటున్నారని, దేశ ప్రగతికి పాటుపడుతూ లక్షల మందికి ఉద్యోగ ఉపాధిని అందిస్తున్న ఇంజనీర్లను రేవంత్ అవమానపరిచారని కేటీఆర్ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పైన స్పందించాల్సిన నైతిక, రాజకీయ బాధ్యత రాహుల్ గాంధీపై ఉందని. ఈ అంశంలో రాహుల్ గాంధీ మౌనంగా ఉండడం అంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థించినట్లే అని కేటీఆర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రితో పాటు ఇంతటి దిగజారుడు ముఖ్యమంత్రిని రాష్ట్రంలోకి పంపిన రాహుల్ గాంధీ సైతం రాజీనామా చెప్పాలని ఆయన డిమాండ్. చేశారు.
‘నేటి యువత రేపటి భారతదేశ నిర్మాతలు’ అన్న విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తుంచుకోవాలని కేటీఆర్ సూచించారు. యువతతో పెట్టుకుంటే ఏమైందో రాహుల్ గాంధీ నానమ్మ ఇందిరమ్మకు ఎమర్జెన్సీ సమయంలో, తెలంగాణ ఉద్యమ సమయంలో యూపీఏ ప్రభుత్వానికి తెలుసని ఆయన గుర్తు చేశారు. యువత తలుచుకుంటే తమ పార్టీ మెడలు ఎలా వంచుతారో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గుర్తుంచుకోవాలి. తెలంగాణ యువత ఓట్లు అడిగి వారిని మభ్యపెట్టిన రాహుల్ గాంధీకి తన నైతిక బాధ్యతను గుర్తు చేయడానికే ఈ లేఖ రాస్తున్నా. రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పైన స్పందించాల్సిన నైతిక, రాజకీయ బాధ్యత రాహుల్ గాంధీపై ఉన్నది.
KTR Letter to Rahul Gandhi on CM criminal waste comments
రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, నైతికత… యువతకు దక్కాల్సిన గౌరవం వంటి అంశాలపైన మాట్లాడే అర్హత కోల్పోయారు. యువత గురించి రాహుల్ గాంధీ చెప్పే ఊకదంపుడు ప్రసంగాలకు భిన్నంగా రేవంత్ రెడ్డి విద్యార్థులను, ఇంజనీర్లను, టీచర్లను క్రిమినల్ వేస్ట్ అంటున్నాడు. ఇప్పటిదాకా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని క్షమాపణ చెప్పాలని ఆదేశించకపోవడం, రేవంత్ రెడ్డి తరఫున రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పకపోవడం… ఆ వ్యాఖ్యలను సమర్థించినట్లే. కేవలం ప్రసంగాలతో నాయకత్వం స్థాయి పెరగదని రాహుల్ గాంధీ గుర్తించాలి. కాంగ్రెస్ పార్టీ విధానాలతోనే చేసిన తప్పులను సరిదిద్దుకోవడంతోనే పెరుగుతుందని గుర్తించి రాహుల్ గాంధీ స్పందించాలి. తమ పార్టీ ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలకు విద్యార్థులకు, గురువులకు, ఇంజనీర్లకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు తనకు సంబంధం లేదని రాహుల్ గాంధీ చెప్పజాలడు.

యువత గురించి ఊకదంపుడు ప్రసంగాలు చేసే హక్కు రాహుల్ గాంధీకి లేదు. . ఇదే తెలంగాణ యువత కేసీఆర్ నాయకత్వంలో కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నారని రాహుల్ గాంధీ గుర్తుంచుకోవాలి. దేశ ప్రగతికి పాటుపడుతున్న ఇంజనీర్లు క్రిమినల్ వేస్ట్ అనడమే కాంగ్రెస్ పార్టీ విధానమా? రాహుల్ చెప్పాలి. తెలంగాణ యువత మీ ముఖ్యమంత్రి చేస్తున్న అడ్డమైన వ్యాఖ్యలను గమనిస్తోంది, గుర్తుంచుకుంటుంది. రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులనే కాకుండా ఇంజనీరింగ్ టీచర్లను తప్పుగా మాట్లాడారు. యువతపైన, విద్యార్థులపైన అడ్డగోలుగా నోరు పారేసుకోవడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారింది. తెలంగాణ యువత ఆత్మగౌరవం పైన, ఆత్మవిశ్వాసం పైన రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. దేశ ప్రగతి కోసం తమ జీవితాన్ని ధారపోస్తున్న అధ్యాపక గురువులను కూడా రేవంత్ రెడ్డి తక్కువ చేసి మాట్లాడారు.

రేవంత్ రెడ్డి గతంలో ఇలాగే యూనివర్సిటీ విద్యార్థులను “బీరు బిర్యానీ బ్యాచ్” అన్నారు. వారి రాజకీయ ఉద్యమాలను తక్కువ చేసి మాట్లాడారు. ఎవరు ప్రశ్నిస్తే వారిని తిట్టడం రేవంత్‌కి అలవాటు అయింది. విద్యార్థులను, ఇంజనీర్లను, టీచర్లను క్రిమినల్ వేస్ట్ అంటున్నాడు. రేవంత్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలే కాబట్టి, రాహుల్ గాంధీ అన్ కండిషనల్ (Unconditional) క్షమాపణ విద్యార్థులకు, యువతకు చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం వెంటనే విద్యార్థులకు, గురువులకు క్షమాపణ చెప్పాలి. ఇంజనీర్లు, గురువులు క్రిమినల్ వేస్ట్ కాదు… యువతను అడుగడుగునా, నిలువునా మోసం చేసిన కాంగ్రెస్సే అసలు సిసలు క్రిమినల్ వేస్ట్! విద్యార్థులను, ఇంజనీర్లను క్రిమినల్ వేస్ట్ అన్న రేవంత్ మాటలు ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ మాటలే. ఇప్పటికే మీ హామీల పేరుతో మోసపోయిన యువత అన్ని గుర్తుంచుకుంటుంది. సరైన సమయంలో తగిన సమాధానం చెబుతుందని గుర్తుంచుకోవాలి అని తన లేఖలో కాంగ్రెస్ పార్టీని కేటీఆర్ హెచ్చరించారు.