హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ మరో మేజర్ అంతర్జాతీయ క్రీడాటోర్నీకి ఆతిథ్యమివ్వబోతున్నది. ఈనెల 8 నుంచి గచ్చిబౌలి వేదికగా రాష్ట్ర క్రీడాశాఖ, సాట్స్ ఆధ్వర్యంలో ఎఫ్ఐహెచ్ మహిళల ప్రపంచకప్ క్వాలిఫయర్స్ టోర్నీ మొదలుకానుంది. ఆతిథ్య భారత్ సహా ఇంగ్లండ్, కొరియా, ఇటలీ, ఆస్ట్రియా, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ బరిలో ఉన్నాయి. మొత్తం ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి తలపడననున్నాయి.
ఇందుకు సంబంధించి గురువారం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన మీడియా భేటీలో క్రీడా మంత్రి శ్రీహరి, సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ సోనీబాలదేవి పాల్గొన్నారు. టోర్నీ కోసం ఇప్పటికే జట్లన్నీ నగరానికి చేరుకున్నాయని, అన్ని రకాల ఏర్పాట్లు చేశామని మంత్రి పేర్కొన్నారు. రూ.18 కోట్లతో నిర్వహిస్తున్న టోర్నీలో అంతర్జాతీయ ప్రమాణాలతో అస్ట్రోటర్ఫ్ మైదానాన్ని అభివృద్ధి చేశామని అన్నారు.