Shiv Pratap Shukla | హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కొత్త గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా నియమితులయ్యారు. పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం హిమాచల్ గవర్నర్‌గా పనిచేస్తున్న శివ ప్రతాప్ శుక్లాను తెలంగాణకు బదిలీ చేశారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు ట్రాన్స్ఫర్ చేశారు.
జిష్ణుదేవ్ వర్మను రాష్ట్రపతి ముర్ము 2024 జూలై 27న తెలంగాణ గవర్నర్‌గా నియమించారు. సుమారు 19 నెలల పాటు తెలంగాణ గవర్నర్‌గా ఆయన వ్యవహరించారు. ఆయన 2018 నుంచి 2023 వరకు త్రిపుర రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన శివ ప్రతాప్ శుక్లా 1989లో తొలిసారి ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత వరుసగా 1991, 93, 96లో ఎమ్మెల్యేగా గెలిచారు. 1996 నుంచి 1998 వరకు సీఎంలు మాయావతి, కల్యాణ్ సింగ్ నేతృత్వంలో ఉత్తరప్రదేశ్ జైళ్ల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. తదనంతర కాలంలో ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికై మోదీ తొలి క్యాబినెట్లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2023 ఫిబ్రవరి 19న హిమాచల్ ప్రదేశ్ 22వ గవర్నర్‌గా నియమితులయ్యారు. అప్పటి నుంచి మూడేండ్లు ఆ రాష్ట్ర గవర్నర్‌గా వ్యవహరించారు.
అసెంబ్లీ ఎన్నికలకు కేవలం నెల రోజులు ఉండగా బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ గురువారం తన పదవికి రాజీనామా చేశారు. దీంతో బెంగాల్ గవర్నర్‌గా తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని కేంద్రం నియమించింది. కేరళ గవర్నర్ అర్లేకర్ తమిళనాడు గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాను లద్దాఖ్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా నియమించారు. అక్కడ ఉన్న కవీందర్ గుప్తాను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా బదిలీ చేశారు. నంద కిషోర్ యాదవ్‌ను నాగాలాండ్ గవర్నర్‌గా, తరణ్ జీత్ సింగ్ సంధును ఢిల్లీ ఎల్జీగా, లెఫ్ట్‌నెంట్ జనరల్ సయ్యద్ అట హస్నైన్ (రిటైర్డ్)ను బీహార్ గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.
గవర్నర్ సీవీ ఆనంద బోస్ హఠాత్తుగా రాజీనామా చేయడం తనను విస్మయానికి గురిచేసినట్లు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. హఠాత్తుగా గవర్నర్ రాజీనామా చేయడానికి దారితీసిన పరిస్థిలేమిటో తనకు తెలియవని, ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని బట్టి చూస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయనపై రాజకీయ ఒత్తిడి పెట్టి రాజీనామా చేయించినా ఆశ్చర్యం లేదని ఆమె వ్యాఖ్యానించారు. ‘అవును. నేను రాజీనామా చేశాను. గవర్నర్‌గా మూడున్నరేండ్లు పనిచేశా. అది చాలు నాకు’ అని పీటీఐ వార్తాసంస్థతో బోస్ పేర్కొన్నారు.