అమ్స్టెల్వీన్ (నెదర్లాండ్స్) : చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత హాకీ జట్టు మరోసారి ఆధిపత్యాన్ని చాటుకుంది. దశాబ్దకాలంగా దాయాదిపై ఉన్న అజేయ రికార్డును కొనసాగిస్తూ హాకీ ప్రపంచకప్‌లో ముందంజ వేసింది. ఈ టోర్నీలో 16 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాక్‌తో తలపడ్డ భారత్ విభాగాల్లో అదరగొట్టింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, అభిషేక్ డబుల్ గోల్స్‌తో విజృంభించడంతో బుధవారం ఉత్కంఠగా సాగిన పూల్-డీ ఆఖరి పోరులో 5-3 తో దాయాదిపై విజయం సాధించి టోర్నీ రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది.హర్మన్ 5, 21వ నిమిషాల్లో రెండు గోల్స్ కొట్టగా.. ఫార్వర్డ్ అభిషేక్ (11, 24వ ని) కూడా డబుల్ ధమాకా మోగించాడు. హార్దిక్ సింగ్ (34వ ని)ఒక గోల్ సాధించాడు. పూల్-డీ నుంచి ఇంగ్లండ్, భారత్ టాప్-2 స్థానాల్లో నిలిచి రెండో రౌండ్‌కు అర్హత సాధించగా.. మూడో స్థానంతో పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
టోర్నీలో నిలవాలంటే పాక్‌పై కనీసం డ్రా చేసుకోవాల్సిన పోరులో భారత్ ప్రారంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. తొలి అర్ధభాగంలోనే నాలుగు గోల్స్‌తో చెలరేగింది. ఆట ఆరంభంలోనే ప్రత్యర్థి డిఫెన్స్‌ను బ్రేక్ చేసింది. 5వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను కెప్టెన్ హర్మన్‌ప్రీత్ పవర్ఫుల్ డ్రాగ్ ఫ్లిక్‌తో గోల్‌గా మలిచి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. కొద్దిసేపటికే కెప్టెన్ అందించిన లాంగ్ పాస్‌ను అందుకోని అభిషేక్ అద్భుత ఫీల్డ్ గోల్‌తో స్కోరును 2-0కి పెంచాడు. రెండో క్వార్టర్ మొదలైన కొద్దిసేపటికే హర్మన్‌ప్రీత్ తన రెండో గోల్ కొట్టి జట్టును 3-0తో ముందంజలో నిలిపాడు. కానీ, తర్వాతి నిమిషంలోనే పాక్ ఆటగాడు హన్నాన్ షాహిద్ గోల్ చేసి తమ జట్టును రేసులోకి తెచ్చే ప్రయత్నం చేసినా.. భారత్ జోరు తగ్గలేదు. చూస్తుండగానే అభిషేక్ తన రెండో గోల్‌తో ఆధిక్యాన్ని 4-1కి తీసుకెళ్లాడు. ఫస్టాఫ్ చివర్లో లభించిన పెనాల్టీ కార్నర్‌ను పాక్ ఆటగాడు సుఫియాన్ గోల్‌గా మలిచినా ఫస్టాఫ్‌ను టీమిండియా 4-2తోముగించింది.

ద్వితీయార్ధంలోనూ భారత్ అదే జోరును కొనసాగించింది. 34వ నిమిషంలో ఆదిత్య లాలాగేను సర్కిల్ లోపల పాక్ డిఫెండర్ అడ్డుకోవడంతో లభించిన పెనాల్టీ స్ట్రోక్‌ను హార్దిక్ సింగ్ ఏమాత్రం పొరపాటు లేకుండా గోల్‌గా మలచడంతో 5-2తో టీమిండియా విజయం దాదాపు ఖాయమైంది. అయినా పాక్ వెనక్కు తగ్గలేదు. చివరి క్వార్టర్లో ఆ జట్టు వరుస దాడులు చేసింది. ఈ క్రమంలో 46వ నిమిషంలో పాక్ ఫార్వర్డ్ షాహిద్ తన రెండో గోల్ సాధించి స్కోరును 3-5కి తగ్గించాడు. ఇక, ఆట చివర్లో ఆదిత్య ఎల్లో కార్డ్ ఎదుర్కొని మైదానం వీడటంతో భారత్ 10 మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి వచ్చింది. అయితే గత పోరులో నిరాశపరిచిన డిఫెండర్లు ఈసారి సమష్టిగా రాణించారు. ఆఖరి నిమిషాల్లో పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టడంతో భారత్ సునాయాస విజయం అందుకుంది. కాగా, మహిళల వరల్డ్‌కప్‌లో భాగంగా గురువారం జరిగే పూల్-డీ చివరి మ్యాచ్‌లో భారత్.. ఇంగ్లండ్‌తో తలపడనుంది.