Shashi Tharoor : కొత్త ఓటర్ల (New Voters) ను చేర్చడం, అప్పటికే ఉన్న ఓటర్ల పేర్లను తొలగించడం వంటి విషయాలు ఎన్నికల సంఘం (Election Commission) లోని ఇద్దరు కమిషనర్ల (Commissioners) కు తెలియకుండా జరిగినట్టు వస్తున్న ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. దాంతో ప్రధాన ఎన్నికల కమిషనర్ (Chief Election Commissioner) జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఎన్నికల సంఘం సాఫ్ట్వేర్ ECINet App పై వివాదం చెలరేగుతోంది. ఆ వినాశకర సాఫ్ట్‌వేర్‌ను రద్దు చేయాలని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) పిలుపునిచ్చారు.
ఇటీవల గోవాలో సర్ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలే థరూర్ స్పందనకు కారణంగా తెలుస్తోంది. ఆ రాష్ట్రంలో కొందరు ఓటర్ల విషయంలో వైరుధ్యాలను డేటాబేస్ గుర్తించింది. క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం అందులోని 97 మంది తుది ఓటరు జాబితాలో చేర్పునకు అర్హులేనని ఓటరు నమోదు అధికారులు గుర్తించారు. అయితే వారి పేర్లను ఓటరు జాబితాలో పునరుద్ధరించేందుకు వారికి ఆప్షన్ అందుబాటులో లేదు. దాంతో రోల్‌బ్యాక్ ఆప్షన్ కోసం గోవా ప్రధాన ఎన్నికల అధికారి ఈసీకి విన్నవించాల్సి వచ్చింది.
కానీ వారి నుంచి అనుమతులు లభించకపోవడంతో ఓటర్ల పేర్లు ఎంటర్ చేయలేకపోయారని, ఆ యాప్ (ECINet App) ను ఢిల్లీ నుంచి నియంత్రిస్తున్నారని జాతీయ మీడియా కథనం పేర్కొన్నది. గోవాలో ఓటరు జాబితాలో పేరు లేకపోతే కేవలం ఓటు మిస్ అవడమే గాకుండా, అనేక ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కోల్పోతారు. ఇదే రాజకీయంగా తీవ్ర వివాదమవుతోంది. ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులోలేని సూపర్-స్పెషాలిటీ చికిత్సలకు నిధులు సమకూర్చే గోవా మెడిక్లెయిమ్ పథకం కేవలం ఆ రాష్ట్ర ఓటర్లకు మాత్రమే అందుబాటులో ఉందని ఆ కథనం పేర్కొన్నది.
దీనిపైనే థరూర్ స్పందించారు. ఇది తీవ్రమైన విషయమని, దీని ద్వారా భారత పౌరుల రాజ్యాంగ హక్కులు కోల్పోవడమే గాకుండా డయాలసిస్ వంటి పలు చికిత్సలకూ దూరం అవుతున్నారని పేర్కొన్నారు. రాజకీయ కుతంత్రాలే చెడ్డవనుకుంటే, ఇక అమానవీయ ప్రవర్తన ఏమాత్రం సహించలేనిదని అన్నారు. దీనిపై ఎన్నికల సంఘం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వినాశకరమైన ఈసీ సాఫ్ట్‌వేర్‌ను వెంటనే రద్దు చేయాలని చెప్పారు. ఈసీ యాప్ కలిగించిన నష్టాన్ని సరిదిద్దడం అత్యావశ్యకమని థరూర్ పోస్టు పెట్టారు.