నర్సంపేట, ఆగస్టు 19 : ఉద్యమ నేత, దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం కూల్చివేతకు నిరసనగా బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు నర్సంపేట నియోజకవర్గ బంద్ సంపూర్ణంగా జరిగింది. నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ, నల్లబెల్లి, దుగ్గొండి మండలాల్లో అన్ని గ్రామాల్లో వివిధ వర్తక, వాణిజ్య, వ్యాపార వర్గాలు, పెట్రోల్ బంక్‌లు, బ్యాంకులు, ఆర్టీసీ స్వచ్ఛంద బంద్‌కు సహకరించాయి. దీంతో ప్రధాన రహదారులు, వాణిజ్య ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శాంతియుత వాతావరణంలో కార్యక్రమాలు కొనసాగాయి.
నర్సంపేట పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీలు, బైక్ ర్యాలీలు వేర్వేరుగా చేపట్టారు. జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, నాయకులు రాయిడి రవీందర్‌రెడ్డి, నల్లా మనోహర్‌రెడ్డి, లెకల విద్యాసాగర్‌రెడ్డి, తకళ్లపల్లి రవీందర్రావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది. కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఖానాపురంలో నర్సంపేట-మహబూబాబాద్ ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీతో పాటు ధర్నా, రాస్తారోకో నిర్వహించాయి.
చెన్నారావుపేట మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. బంద్‌లో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ఆరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. నెక్కొండలో బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్‌చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నల్లబెల్లిలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ తీశారు. దుగ్గొండి మండలంలో బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. గిర్నిబావి సెంటర్లో ర్యాలీ నిర్వహించారు.