సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఆంధ్రా అధికార భూతం వదలడం లేదని తెలంగాణ అధికారులు మండిపడుతున్నారు. ముఖ్యంగా వైద్య, ఆరోగ్యశాఖలో రాష్ట్రం ఆవిర్భవించి 12ఏండ్లు గడిచిపోయినా ఇంకా ఆంధ్రా అధికారుల హవానే కొనసాగుతుందని స్థానిక అధికారులు వాపోతున్నారు.
కీలక పోస్టులన్నీ ఆంధ్రాకు చెందిన వారికే అంటగడుతున్నారని తెలంగాణ వాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీనియారిటీ ప్రకారం కీలక పదవులను అనుభవించిన తరువాత కూడా కొందరికి అధికార వ్యామోహం తీరడం లేదని, తమకు ఉన్న పలుకుబడి, పెట్టుబడులతో ఫోకల్ పోస్టింగ్‌లను పొందుతున్నారని స్థానిక అధికారులు ఆరోపిస్తున్నారు. మరికొంత మంది పదవీ విరమణ చెందిన తరువాత కూడా కీలక పోస్టులను పొందుతున్నారని తెలంగాణ వైద్యలోకం మండిపడుతోంది.
అన్ని అర్హతలున్నా తెలంగాణ అధికారులను పక్కనబెట్టి, ఆంధ్రా అధికారులకే కాంగ్రెస్ సర్కార్ పట్టం కడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైద్య, ఆరోగ్య శాఖలోని కీలక పోస్టులన్నీ రాజకీయ పలుకుబడి, ఆంధ్రా మూలాలు ఉన్న వారికే దక్కుతున్నాయని, దీంతో తెలంగాణ వాసులకు తీవ్ర అన్యాయమే మిగిలిందని పలువురు వైద్యాధికారులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.
అర్హులైన స్థానిక అధికారులున్నా చాలా సందర్భాలలో సీనియారిటీని కూడా పక్కనబెట్టి, ఇన్చార్జ్ అనే ట్యాగ్ తగిలించి పోస్టింగ్‌లు అంటగడుతున్నారని బాధిత అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఎంఈ కార్యాలయంలో ఆంధ్రా అధికారులదే హవా నడుస్తోందని, ప్రస్తుతం ఒక కీలక పోస్టును ఆంధ్రాకు చెందిన అధికారికే కట్టబెట్టారని, ప్రస్తుతం ఖాళీగా ఉన్న గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ పోస్టును సైతం ఆంధ్రా వారికే కేటాయించేందుకు పావులు కదుపుతున్నారని, సీనియారిటీ, అర్హత ఉన్న తెలంగాణ అధికారులకు మాత్రం మొండిచెయ్యే మిగిలిందని స్థానిక వైద్యవర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
కేసీఆర్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టిమ్స్‌ను పదవీ విరమణ పొందిన ఆంధ్రా అధికారుల చేతిలో పెటడ్టంపై తెలంగాణ వైద్య ప్రపంచం మండి పడుతోంది. మొన్నటి వరకు ఉన్నత పదవులు అనుభవించిన వారికే మళ్లీ కీలక పదవులు అంటగట్టడమేంటని తెలంగాణ వైద్యులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో అర్హులైన వైద్యులే లేరా అని ప్రశ్నిస్తున్నారు.
సర్వీసులో ఉన్న వారికి టిమ్స్ డైరెక్టర్, సూపరింటెండెంట్ పోస్టులు ఇస్తే సీనియర్ అధికారులకు న్యాయం జరగడంతో పాటు అర్హులైన అందరికీ అవకాశాలు లభిస్తాయని, అలా కాకుండా మొన్నటి వరకు ఉన్నత పదవులు అనుభవించి, పదవీ విరమణ పొందిన ఆంధ్రా అధికారులకే తిరిగి టిమ్స్ బాధ్యతలను కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమని అధికారులు మండిపడుతున్నారు. సర్వీసులో ఉన్న వారికి పోస్టింగ్‌లు ఇవ్వడం వల్ల అదనపు ఆర్థిక భారం తప్పడమే కాకుండా అందరికీ అవకాశాలు లభించడంతో పాటు అర్హులైన వారికి న్యాయం జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.