హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కారుణ్య నియామకాలు, మెడికల్ ఇన్వాలిడేషన్ సీమ్ కింద కన్సాలిడేటెడ్ పేపై పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీస్‌ను రెండేండ్లకే క్రమబద్ధీకరించాలని టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం కన్సాలిడేటెడ్ పేపై మూ డేండ్ల సర్వీసు పూర్తిచేయాల్సి ఉండేది.
క్రమబద్ధీకరణ కోసం గతంలో నిర్వహించే పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ టెస్ట్ నుంచి అభ్యర్థులకు మినహాయింపు ఇచ్చారు. అభ్యర్థులు తమ రెండేండ్ల సర్వీసులో ఏటా కనీసం 240 పనిదినాలు పూర్తిచేసి ఉండాలి. ప్రసూతి సెలవులనూ పనిదినాలుగా పరిగణిస్తా రు. ఇప్పటికే రెండేండ్ల సర్వీస్ పూర్తి చేసుకొన్న ఉద్యోగుల సేవలను మార్చి 1 నుంచి క్రమబద్ధీకరిస్తారు.
మార్చి 1 తర్వాత రెండేండ్లు పూర్తిచేసుకొనే వా రికి, ఆ గడువు ముగిసిన తర్వాతి నెల ఒకటో తేదీనుంచి రెగ్యులరైజేషన్ వర్తిస్తుందని పేర్కొన్నారు. సుదీర్ఘ సెలవు, అనారోగ్యంతో విధులకు దూరంగా ఉన్నవారు.. తిరిగి విధుల్లో చేరాక తాజా ఉత్తర్వుల ప్రకారం వారి సేవలను క్రమబద్ధీకరిస్తారు. దీంతో డ్రైవర్ గ్రేడ్-2, కండక్టర్ గ్రేడ్-2, ఆర్టీసీ కానిస్టేబుల్, శ్రామిక్ పోస్టుల్లో పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులకు ఈ నిర్ణయం లబ్ధిచేకూర్చనున్నది.