శ్రద్ధాకపూర్ నటిస్తున్న సంచలనాత్మక బయోపిక్ ‘ఈఠా’. మరాఠీ జానపద కళాకారిణి విఠాబాయి నారాయణ్ గావ్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో విఠాబాయిగా శ్రద్ధాకపూర్ కనిపించనున్నది. బ్లాక్బస్టర్ ‘ఛావా’ చిత్రాన్ని రూపొందించిన లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. వచ్చే ఏడాది సమ్మర్కే సినిమాను విడుదల చేయాలనే తలంపుతో ముందుకెళ్తున్నారు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. ఇదిలావుంటే.. ఈ సినిమా లొకేషన్లో శ్రద్ధాకపూర్ కాలికి గాయమైంది. దాంతో షూటింగ్ వాయిదా పడింది.
పెద్ద కట్టుతో ఉన్న తన కాలి ఫొటోను రీసెంట్గా శ్రద్ధ తన సోషల్మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతో జరిగిన ప్రమాదం గురించి క్లారిటీ ఇచ్చారు శ్రద్ధా కపూర్. ‘ఈ పాత్ర కోసం 15కేజీలు బరువు పెరిగాను. పాత్రకోసం చీరకట్టుతోపాటు బరువైన ఆభరణాలు ధరించాల్సొచ్చింది. దాంతో డాన్స్ సమయంలో ఇబ్బందులు తలెత్తాయి. కాలి కండరాలు ఒత్తిడికి గురి అయ్యాయి. రెస్ట్ ఓ వారం మాత్రమే. మళ్లీ షూటింగ్ మొదలుపెట్టేస్తా.’ అని పేర్కొన్నారు శ్రద్ధాకపూర్.