Peddi | మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తన నెక్స్ట్ భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’ పనులలో స్పీడ్ పెంచాడు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు సంబంధించిన కీలక అప్డేట్ తాజాగా బయటకు వచ్చింది. రామ్ చరణ్ తన డబ్బింగ్ పార్ట్‌ను ప్రారంభించినట్లు రీసెంట్గా విడుదలైన పోస్టర్‌తో క్లారిటీ వచ్చింది. పోస్టర్ చూసి మెగా అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఇక ‘పెద్ది’ చిత్రాన్ని బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నారు. ‘ఉప్పెన’తో సంచలన విజయాన్ని అందుకున్న ఆయన, ఈసారి గ్రామీణ నేపథ్యంతో క్రీడల అంశాన్ని మిళితం చేసి ఓ పవర్ఫుల్ కథను తెరపైకి తీసుకురాబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్‌లకు మంచి స్పందన లభించగా, ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మరోవైపు ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ “రై రై రా రా” విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పాటను మార్చి 2న విడుదల చేస్తామని చిత్ర బృందం గతంలో ప్రకటించింది. అయితే ఇప్పటివరకు ఎలాంటి కౌంట్‌డౌన్ పోస్టర్లు లేదా ప్రోమోలు విడుదల కాలేదు. దీంతో సాంగ్ రిలీజ్ వాయిదా పడే అవకాశముందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ పాటలో రామ్ చరణ్ తన ప్రత్యేక గ్రేస్‌తో పాటు ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్‌తో అలరించనున్నట్లు సమాచారం. గ్రామీణ బీట్తో మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఈ సాంగ్ ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలుస్తోంది. రెహమాన్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తుండగా, కీలక పాత్రల్లో శివరాజ్ కుమార్, జగపతి బాబు వంటి ప్రముఖులు కనిపించనున్నారు. బలమైన భావోద్వేగాలు, గ్రామీణ వాతావరణం, క్రీడల నేపథ్యంతో కథ సాగుతుందని సమాచారం. ఈ సినిమా ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.