కుత్బుల్లాపూర్, జూలై 28 : తమకు నచ్చిన వారికి నజరానా.. నచ్చని వారికి జరిమాన అనే పద్ధతిలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం హైడ్రా వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని బీఆర్ఎస్ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ధ్వజమెత్తారు. హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తూ మంగళవారం పేట్ బషీరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైడ్రా అక్రమాలపై బీఆర్ఎస్ పార్టీ పేద, మధ్యతరగతి ప్రజల పక్షాన సాగించిన సుదీర్ఘ పోరాటానికి హైకోర్టు తీర్పు ఒక ప్రతిఫలమని అన్నారు.
రేవంత్‌రెడ్డి అవలంబిస్తున్న హిట్లర్ పోకడలకు ఈ తీర్పు చెంపపెట్టు లాంటిదన్నారు. ఏ వ్యవస్థ అయినా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం నడవాలే తప్ప రేవంత్‌రెడ్డి రాజ్యాంగం ప్రకారం కాదని న్యాయస్థానం స్పష్టం చేసందని అన్నారు. మున్సిపల్ శాఖ రేవంత్‌రెడ్డి వద్దనే ఉన్నందున, హైకోర్టు తీర్పుతో ఆ శాఖ మంత్రిగా ఆయన కొనసాగే నైతిక అర్హతను పూర్తిగా కోల్పోయారని, వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విపత్తు సమయాల్లో ప్రజలను ఆదుకోవాల్సిన హైడ్రా, వారిని ముంచుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాహుల్ మౌనం వెనుక మర్మమేంటి..
ఒకవైపు రాజ్యాంగ ప్రతులను పట్టుకొని తిరిగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, తెలంగాణలో రేవంత్‌రెడ్డి సాగిస్తున్న రాజ్యాంగ ఉల్లంఘనలపై మౌనంగా ఉండటం అనేక అనుమానాలకు తావిస్తొందని ఎమ్మెల్యే అన్నారు. రేవంత్‌రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలకు బ్రాం డ్ అంబాసిడర్ అని, రాహుల్ కూ డా ఆ బ్లాక్‌మెయిల్‌కు బాధితుడిగా మారి ధృతరాష్ర్టుడిలా వ్యవహరిస్తున్నారా అని ప్రశ్నించారు. హైకోర్టు తీర్పుతో రేవంత్ సర్కా ర్కు కౌంట్‌డౌన్ ప్రారంభమైందన్నారు.